విజయవాడలో వెరైటీ పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. అక్కడ అంతా ఉత్కంఠభరితంగా ఉందని సోషల్ మీడియాలో వాయించేస్తున్నారు. కొన్ని యూట్యూబ్ చానెల్స్ ఏదో అద్భుతం జరుగుతుందని చెప్పుకొస్తున్నాయి. అయితే ఇక్కడ ఎవరు గెలుస్తారనే విషయంలో ఉత్కంఠ ఏమీ లేదు. జనసేన తరపున నిలబడ్డ వంగవీటి రాధా గెలుపు ఖాయమే అని అర్ధమవుతోంది.
అయితే ఇండీ కూటమి తరపున నిలబడ్డ ఇండిపెండెంట్ అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీని అభిమానించే కమ్మ సామాజికవర్గం ఓట్లు ఎన్ని తెచ్చుకోగలడనేదే ఉత్కంఠ అని చెప్పాలి. అవును అది కూడా జరిగే పని కాదనే లాజిక్ వినపడుతోంది. కాని ఏబీ గట్టి పోటీ ఇస్తున్నట్లు.. అసలు మలుపు తిప్పేసినట్లు తెగ చెప్పేస్తున్నారు కొందరు. వాస్తవానికి అలాంటిదేమీ జరిగే ఛాన్స్ కనపడటం లేదు. ఏ లెక్కన చూసినా రాధాదే గెలుపు అంటున్నారు. వైసీపీ పైతం ఏబీ వెంకటేశ్వరరావు గొడవలో పడి.. వారి పని కూడా వదిలేశారు. అభ్యర్ధి విషయంలోనే హ్యాండ్సప్ అయ్యారు.. కాని ఏబీవీ రంగంలోకి దిగటంతో.. ఆయన టీడీపీ ఓట్లు చీలుస్తారనే ఆశలో పడ్డారు.
వాస్తవానికి ఏబీ వెంకటేశ్వరరావు కొన్ని నెలల నుంచి చంద్రబాబు, లోకేష్‌పై ఒక రేంజులో విరుచుకుపడుతున్నారు. అమరావతిలో సెకండ్ ఫేజ్ వ్యవహారంపై ధ్వజమెత్తారు. ఇక మైనింగ్ ఇతర వ్యవహారాల్లో అవినీతి జరుగుతుందని ఆరోపిస్తున్నారు. అయితే ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంపై టీడీపీ అభిమానులు కస్సుమంటున్నారు. అందుకే వారి ఓట్లలో కొన్ని అయినా ఏబీవీకి పడటం అనేది అసాధ్యం.
అటు వైసీపీ ఓట్లు పడతాయా అనుకుంటే..ఇంటెలిజెన్స్ చీఫ్‌గా చేసినప్పుడు టీడీపీ ఆదేశాలను పాటిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీ మారేలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అసలు అందుకే జగన్ టార్గెట్ చేసి పోస్టింగ్ లేకుండా చేశారని చెప్పుకుంటారు. అలాంటిది వైసీపీ ఓట్లు మాత్రం ఎందుకు వస్తాయి. అంటే అటు టీడీపీ ఓట్లు చీలవు… వైసీపీ ఓట్లు చీలవు.. కేవలం వామపక్షాలు, కాంగ్రెస్ వారి ఓట్లు అవి కూడా సామాన్యుల ఓట్లు రావు… కేవలం కొందరు మేధావులు, ఉద్యోగులు, కొందరు మిడిల్ క్లాస్ ఓట్లు మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంది.
గెలిచే ఛాన్స్ లేదని తెలుసు కాబట్టి వాటిలో సగం వెనక్కి పోయినా పోతాయి. చివరకు ఎన్ని మిగులుతాయో చెప్పలేం. పైగా విజయవాడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వదిలేసి రౌడీయిజం, అవినీతి అంటూ అవే పట్టుకుని మాట్లాడుతుంటే కూడా డ్యామేజ్ జరగకుండా ఉండదు. ఆ సమస్యలను సీరియస్‌గా ఫీలవని జనం ఏబీవీ మొహం కూడా చూడరు.
ఇటు వంగవీటి రాధా తెలివిగా విజయవాడ నగర సమస్యలు, అభివృద్ధి మీదే మాట్లాడుతున్నాడు. డ్రైనేజీ సమస్యలు, మంచినీటి సమస్యలు తీరుస్తానని హామీ ఇస్తున్నాడు. పైగా ఏబీ వెంకటేశ్వరరావు లాంటి మేధావుల సలహాలు కూడా తీసుకుంటానని చెబుతున్నాడు. దీంతో సామాజికవర్గాల ఓట్లే కాదు.. సామాన్యుల ఓట్లు, అటు చదువుకున్నవాళ్లు ఓట్లు కూడా రాధాకు వెళ్లే అవకాశం పుష్కలంగా కనపడుతోంది. ఏ లెక్కన చూసినా.. ఎన్ని వైపుల నుంచి చూసినా వంగవీటి రాధా గెలుపు ఖాయమని.. ఏబీ వెంకటేశ్వరరావు హడావుడి సోషల్ మీడియాకే పరిమితమని చెప్పక తప్పటం లేదు.
