ప్రకృతి వైపరీత్యాలను పూర్తిగా నివారించడం సాధ్యపడకపోయినా సరే, లేటెస్ట్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ పోతే.. ముందస్తు రక్షణ చర్యలతో ప్రాణ, ఆస్తి నష్టాలను కనిష్ట స్థాయికి తీసుకురావొచ్చని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. అర్నబ్ తుపాను కల్పించిన తీవ్ర ఆందోళనల వల్ల గురువారం ఆయన కృష్ణా, పశ్చిమ గోదావరి,డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఏరియల్ సర్వే చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు..ప్రభుత్వం తీసుకున్న తక్షణ చర్యలను, భవిష్యత్ కార్యాచరణను సుదీర్ఘంగా వివరించారు.
గతంలో వచ్చిన 1977 దివిసీమ ప్రళయంతో పాటు 1996 నాటి కోనసీమ తీవ్ర తుపానుల ఘోరాలను సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాటి కఠిన అనుభవాల ఆధారంగా ఈసారి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, అగ్నిమాపక శాఖలను ముందుగానే మోహరించి, అర్ధరాత్రి సమయంలో కూడా యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉంచామన్నారు.
నిమిష నిమిషానికి తుపాను తీవ్రతను అంచనా వేస్తూ.. కింది స్థాయికి సమాచారం చేరవేయడం వల్లే వేలాది మందిని రక్షించగలిగామని చెప్పిన చంద్రబాబు.. అయినా కూడా దురదృష్టవశాత్తు ఏడుగురు మరణించారని చెప్పారు. ముందస్తు ప్రభుత్వం చేసిన హెచ్చరికలను కొందరు ప్రారంభంలో వ్యంగ్యంగా చూసినా, ఆ తర్వాత తీవ్రత పెరిగే సరికి అర్థం చేసుకున్నారని అన్నారు.
మరోవైపు ఆర్మీ హెలికాప్టర్‌లో 30 ఏళ్ల క్రితం ప్రమాదకర పరిస్థితుల్లో పర్యటించి, రాజమండ్రి ఆర్డీవో ఆఫీస్‌ను సెక్రటేరియట్‌గా మార్చి అక్కడ పరిస్థితులు చక్కదిద్దిన సంఘటనలను కూడా చంద్రబాబు ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న సవాలు విద్యుత్ పునరుద్ధరణే అని సీఎం తెలిపారు.
ఒక్క కోనసీమ ప్రాంతంలోనే సుమారు 8వేల విద్యుత్ స్తంభాలు కూలిపోగా, ఏపీ వ్యాప్తంగా డ్యామేజ్ ఎక్కువగా ఉందన్నారు. దీంతో కరెంట్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించడానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి వెయ్యి మంది నైపుణ్యం కలిగిన సిబ్బందిని పంపాలని ఇప్పటికే కోరామని, అవసరమైతే ఇతర పొరుగు రాష్ట్రాల సహాయం కూడా తీసుకుని 2 రోజుల్లో 100% విద్యుత్ పునరుద్ధరిస్తామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.
