ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీ ఏర్పాటుపై ఆసక్తి నెలకొంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విజయదశమి రోజున తన కొత్త పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నట్లు తెలిపారు. టీడీపీ, జనసేన, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.కూలీల నుంచి కార్పొరేట్ రంగంలోని వ్యక్తుల వరకు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు చూపడమే తమ పార్టీ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రి పదవికి పోటీలో లేనని, పార్టీకి వెనుక నుంచి మార్గదర్శకుడిగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు.ముఖ్యంగా యువతకు రాజకీయాల్లో అధిక ప్రాధాన్యం కల్పించనున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సున్న యువతీ యువకులకు 66 శాతం రాజకీయ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. కుల రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దృష్టి సారిస్తామని చెప్పారు.ప్రస్తుతం కొత్త పార్టీ పేరు, జెండా, విధివిధానాలు, ఆవిర్భావ తేదీపై కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. దసరా ప్రకటనతో పార్టీకి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
