తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్దలు లేదా స్టార్ ప్రొడ్యూసర్లు చేసే చిన్న చిన్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో ఏ రేంజ్లో ట్రెండ్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నోటి నుంచి వచ్చే సరదా మాటలకు టాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.
గతంలో ఆయన ఏ హీరోయిన్నైనా సరదాగా ఆశీర్వదిస్తే, ఆ తర్వాత కొద్ది రోజులకే వాళ్లకు పెళ్లి జరగడం యాదృచ్ఛికంగా జరిగింది. దీంతో అరవింద్ చేతుల మీదుగా ఆశీర్వాదం అందుకుంటే చాలు ఇక పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమనే సరదా టాక్ మొదలైంది. ఇప్పుడు తాజాగా గ్లామరస్ బ్యూటీ రుహానీ శర్మకు కూడా అల్లు అరవింద్ పెళ్లి ఆశీస్సులు అందించడంతో ఈ వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.
రుహానీ శర్మ నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ మూవీకి సంబంధించిన ఒక సందర్భంలో ఆమెను కలిసిన అల్లు అరవింద్, పర్సనల్‌గా ఒక సరదా ప్రశ్న వేశారు. ప్రస్తుతం ఎవరినైనా ప్రేమిస్తున్నావా? అని ఆరా తీశారు. దానికి రుహానీ లేదండీ అన్నట్లుగా తల ఊపింది. దాంతో వెంటనే స్పందించిన అల్లు అరవింద్.. నీకు త్వరలోనే పెళ్లి జరుగుతుంది, అది కూడా మన హైదరాబాద్ అబ్బాయితోనే అవుతుంది” అని ఫన్నీగా దీవించారు. ఆయన చెప్పిన ఈ ఆశీర్వాదాన్ని రుహానీ శర్మ కూడా చాలా పాజిటివ్‌గా తీసుకుంది. అల్లు అరవింద్ లాంటి పరిశ్రమ పెద్ద నుంచి అలాంటి మాటలు రావడం తన అదృష్టమని మురిసిపోయింది.
అసలు ఈ ఆశీర్వాదాల గోల వెనుక ఉన్న అసలు సీన్ ఏంటంటే.. గతంలో నటి లావణ్య త్రిపాఠిని అల్లు అరవింద్ ఓ ఈవెంట్లో దీవించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆమె మెగా ఫ్యామిలీకి కోడలై, వరుణ్ తేజ్‌ను పెళ్లాడింది. అలాగే ‘భీష్మ’ సినిమా సమయంలో రష్మిక మందన్నకు కూడా ఆయన ఆశీస్సులు లభించాయి. ఆ తర్వాత ఆమె విజయ్ దేవరకొండతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఇలా ఆయన దీవించిన ప్రతి హీరోయిన్‌కు లవ్ అండ్ మ్యారేజ్ యోగం కలసిరావడంతో సినీ వర్గాల్లో అల్లు అరవింద్ బ్లెస్సింగ్స్‌కు ఒక సెంటిమెంట్ క్రియేట్ అయింది.
ఇటీవలే బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్‌కు కూడా అరవింద్ ఇలాగే పెళ్లి ఆశీర్వాదం ఇవ్వడంతో ఆమె పెళ్లిపై కూడా రకరకాల రూమర్లు షికారు చేశాయి. ఇప్పుడు లేటెస్ట్గా రుహానీ శర్మ వంతు వచ్చింది. అయితే ఇది కేవలం అల్లు అరవింద్ సరదాగా అన్న మాటే తప్ప, రుహానీ శర్మ పెళ్లిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఆమె హైదరాబాద్ అబ్బాయిని చేసుకోబోతోందనేది కూడా కేవలం ఆయన వేసిన జోక్ మాత్రమే.
ఏది ఏమైనా, గతంలో జరిగిన మ్యాజిక్స్ చూసిన ఫ్యాన్స్ మాత్రం.. రుహానీ విషయంలోనూ అల్లు అరవింద్ మాట నిజమై త్వరలోనే గుడ్ న్యూస్ వింటామా ఏంటి అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
