ఇండియాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బిజినెస్ ఫ్యామిలీలలో ఒకటైన టీవీఎస్ గ్రూప్లో వారసత్వ ఆస్తుల పోరు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. టీవీఎస్ మోటార్ కంపెనీ ఛైర్మన్ ఎమెరిటస్ వేణు శ్రీనివాసన్ కుమార్తె లక్ష్మీ వేణు, జాయింట్ ఫ్యామిలీ ఆస్తులలో తనకు చట్ట ప్రకారం రావాల్సిన వాటాను విభజించి ఇవ్వాలని కోరుతూ మద్రాస్ హైకోర్టు గుమ్మం ఎక్కారు. వ్యాపార ప్రపంచంలో టాప్లో ఉన్న కుటుంబాల్లోని కుమార్తెల ఆస్తి హక్కుల అంశాన్ని ఈ కేసు మరోసారి నేషనల్ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మార్చింది.
ఈ వివాదానికి 2024లో కుటుంబ సభ్యుల మధ్య కుదిరిన ఒక ఇంటర్నల్ అగ్రిమెంటే మెయిన్ రీజన్ . అప్పట్లో కుదిరిన అగ్రిమెంట్ కేవలం వ్యాపార నిర్వహణ బాధ్యతల పంపకానికి మాత్రమే పరిమితమైందని, జాయింట్ ఫ్యామిలీ ఆస్తులలో తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను మాత్రం పరిష్కరించలేదని లక్ష్మీ వేణు, ఆమె తల్లి మల్లికా శ్రీనివాసన్ కోర్టుకు నివేదించారు.
అయితే, తన ఇద్దరు పిల్లలకు పూర్తి న్యాయం జరిగేలాగే అప్పటి విభజన జరిగిందని వేణు శ్రీనివాసన్ వాదిస్తున్నారు. టీవీఎస్ హోల్డింగ్స్, టీవీఎస్ మోటార్ కంపెనీ, టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్, సుందరం క్లేటన్ వంటి కీలక కంపెనీల్లోని వాటాలను ప్రస్తుతం వీఎస్ ట్రస్ట్, ఇతర హోల్డింగ్ సంస్థల ద్వారా నిర్వహిస్తున్నారు.
ఈ న్యాయపోరాటంలో లక్ష్మీ వేణు హిందూ వారసత్వ చట్టం-1956 బేస్ చేసుకుని తన హక్కులను కోరుతున్నారు. 2005లో ఈ చట్టానికి చేసిన హిస్టారికల్ సవరణ ప్రకారం, హిందూ జాయింట్ ఫ్యామిలీ కొడుకులతో సమానంగా కుమార్తెలకు కూడా పిత్రార్జితంలో పుట్టుకతోనే సమాన హక్కులు లభిస్తాయి.
ఆస్తి విభజనను డిమాండ్ చేసే హక్కు కుమార్తెలకు ఉంటుందని, ఆ కండీషన్ అమల్లోకి వచ్చినప్పుడు తండ్రి జీవించి ఉన్నారా లేదా అనే దానితో సంబంధం లేదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నారు.
అయితే, ఈ విచారణలో కొన్ని సంక్లిష్టమైన లీగల్ అంశాలు ముడిపడి ఉన్నాయని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. తండ్రి స్వార్జితానికి, పిత్రార్జితానికి మధ్య తేడా చాలా కీలకమైనది. పిత్రార్జితాన్ని చట్ట ప్రకారం పంచాల్సి ఉండగా, స్వార్జితాన్ని తండ్రి తన ఇష్టానుసారం కేటాయించొచ్చు. పైగా టీవీఎస్ ఆస్తులు ఎక్కువగా ఫ్యామిలీ ట్రస్టుల కింద ఉండటంతో, వాటి చట్టపరమైన యాజమాన్యం ట్రస్టుకే చెందుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బిజినెస్ కంట్రోల్ వేరు, ఆస్తుల యాజమాన్యం వేరు అని నిపుణులు భావిస్తున్నారు.
సాధారణంగా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కుదిరితే అది అందరికీ వర్తిస్తుంది. కానీ మోసం లేదా ఒత్తిడి వంటి రీజన్స్ ఉంటే దానిని కోర్టులో సవాలు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మద్రాస్ హైకోర్టు 2024 అగ్రిమెంట్ చెల్లుబాటును, లక్ష్మీ వేణు ఆర్థిక హక్కుల సొల్యూషన్ను పరిశీలించనుంది. ఈ కేసులో వచ్చే ఫైనల్ జడ్జిమెంట్ ఫ్యూచర్లో ఇండియన్ బిజినెస్ ఫ్యామిలీలలో ఉత్పన్నమయ్యే వారసత్వ వివాదాలకు ఒక ఉదాహరణగా నిలుస్తోంది.
