ఏపీలో సార్వత్రిక ఎలక్షన్ నుంచి మొదలైన కూటమి విజయ పరంపర ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటుతోంది. తాజాగా మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో చూపిన హవానే ఇప్పుడు పంచాయతీ పోరులో కూడా స్పష్టంగా కనిపించింది. ఏపీలో 3 దశల్లో నిర్వహిస్తున్న పంచాయతీ పోరులో భాగంగా, నవంబర్ 26వ తేదీన జరిగిన తొలి విడత పోలింగ్ ఫలితాలు సాయంత్రానికి కొన్ని చోట్ల రాత్రికి వెలువడ్డాయి. ఈ పల్లె పోరు ఫలితాల్లో అధికార టీడీపీ మద్దతుదారులు అద్భుత విజయాన్ని సాధించి గ్రామీణ ప్రాంతాలపై.. తమకున్న పట్టును మరోసారి నిరూపించుకున్నారు.
మొత్తం ఫస్ట్ స్టేజిలో 3,949 సర్పంచ్ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయగా, దానిలో ఏకంగా 760 పంచాయతీలు ఏకగ్రీవంగా ముగిశాయి. ఇక మిగిలిన 3,189 సర్పంచ్ పదవుల కోసం తీవ్ర పోటీ మధ్య నవంబర్ 26వ తేదీ గురువారం ఉదయం నుంచి పోలింగ్ సాగింది.
సాయంత్రం ఓట్ల లెక్కింపు పూర్తి కాగా, ఏకగ్రీవాలను కలుపుకొని ఏకంగా 2,321 పంచాయతీల్లో టీడీపీ అభ్యర్థులు విజయాన్ని సాధించారు. ఇక ఎన్డీయే కూటమిలోని మిత్రపక్షాలైన జనసేన అభ్యర్థులు 118 స్థానాలలో, బీజేపీ అభ్యర్థులు 25 స్థానాలలో గెలుపొందారు. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ 1,103 స్థానాలకే పరిమితం కాగా, స్వతంత్రులు, ఇతరులు 295 స్థానాల్లో విజయకేతనాన్ని ఎగరవేశారు.
ఈ ఎలక్షన్లో మేజర్ పంచాయతీల్లో కూడా కూటమి తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించుకున్నారు. 10 వేల కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న 52 పెద్ద పంచాయతీల రిజల్ట్ పరిశీలిస్తే, దీనిలో 28 స్థానాలను ఎన్డీయే కేండిడేట్స్ గెలుచుకున్నారు. దీనిలో 25 మేజర్ పంచాయతీలు టీడీపీ అకౌంట్లోకి వెళ్లగా, 3 స్థానాల్లో జనసేన అభ్యర్థులు నెగ్గారు. వైసీపీకి కేవలం 6 మేజర్ పంచాయతీలు మాత్రమే దక్కాయి. ఇక ఏకగ్రీవాల్లో ఎక్కువగా తిరుపతి జిల్లాలోనే 136 పంచాయతీలు ఏకపక్షంగా ముగిశాయి.
ఏపీ వ్యాప్తంగా ఫస్ట్ ఫేజ్‌లో 77.65 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లా వారీగా చూస్తే చిత్తూరు జిల్లా 83.37 శాతంతో టాప్‌లో నిలవగా, శ్రీకాకుళం జిల్లా 66.93 శాతంతో పస్ట్ ప్లేస్‌లో నిలిచింది. పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల్లోని 3 పోలింగ్ కేంద్రాల్లో గందరగోళం కారణంగా రీ-పోలింగ్ నిర్వహించడానికి ఏపీ ఎన్నికల సంఘం ఆదేశించింది. అక్కడ రీ పోలింగ్ పూర్తయిన తర్వాత మిగిలిన రిజల్ట్‌ను పూర్తిగా వెల్లడించనున్నారు.
