ఫోన్‌పే, గూగుల్ పే వంటి యూపీఐ చెల్లింపులపై ప్రతిపాదించిన మర్చెంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ఛార్జీల అమలును నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం. వ్యాపారుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.గతంలో రూ.2,000 దాటిన పర్సన్-టు-మర్చెంట్ (P2M) లావాదేవీలపై 0.4 శాతం ఛార్జీ విధించాలని ప్రతిపాదించారు. ఈ ఛార్జీ గరిష్ఠంగా రూ.300 వరకు ఉండాలని సూచించారు. రైల్వే, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధనం, వ్యవసాయ ముడిసరుకుల వంటి రంగాల్లో రూ.2,000 దాటిన లావాదేవీలకు రూ.5 ఫ్లాట్ ఛార్జీని కూడా ప్రతిపాదించారు.దసరా, దీపావళి పండుగల సమయంలో ఈ ఛార్జీలు అమలు చేస్తే వ్యాపారాలపై ప్రభావం పడే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో తుది నిర్ణయాన్ని నవంబర్ రెండో వారం తర్వాత ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అప్పటివరకు ప్రతిపాదిత అదనపు ఛార్జీలు అమలులోకి రావని తెలుస్తోంది. దీంతో వ్యాపారులకు తాత్కాలిక ఊరట లభించనుంది.
