రాజ్యాంగ సవరణ బిల్లుల అంశం రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారబోతోంది. నవంబరు 30వ తేదీ నుంచి మొదలయ్యే సభలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే లోక్‌సభలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం ఈ బిల్లును ఆమోదింపజేసుకోవడం ఎన్డీయేకు సాధారణ విషయం కాదన్న వాదన వినిపిస్తోంది.
లోక్‌సభ సభ్యుల సంఖ్య ప్రస్తుతం 540 కాగా, రాజ్యాంగ సవరణ చట్టం నిబంధనల ప్రకారం ఓటింగ్‌లో పాల్గొనే వారిలో 2/3 వంతు అంటే కనీసం 360 మంది సభ్యుల ఆమోదం కావాలి. ప్రస్తుతమున్న లెక్కల ప్రకారం చూస్తే ఎన్డీయే పక్షాన 320 మంది ఎంపీలు ఉన్నారు. ఈ సమయంలో ఈ బిల్లు గట్టెక్కాలంటే కనీసం మరో 40 మంది సభ్యుల సపోర్ట్ కూటమికి అత్యవసరంగా మారింది.
ఈ సవాలును దాటడానికి ప్రభుత్వం ముందు 3 ప్రధాన సమీకరణలు కనిపిస్తున్నాయి. డీఎంకే, ఎన్సీపీ-ఎస్పీ, వై సీపీలు అనుకూలంగా ఓటు వేసినా కూడా కూటమి బలం 354 వద్దే ఆగిపోయి, మరో 6 ఓట్ల లోటు మిగులిపోతోంది. ఒకవేళ డీఎంకే లేదా ఎన్సీపీ సభ్యులు ఓటింగ్‌కు గైర్హాజరై సభలోని మొత్తం ఓటర్ల సంఖ్య తగ్గినా కూడా, అవసరమైన కొత్త మెజారిటీ మార్క్‌ను చేరుకోవడానికి మాత్రం ఎన్డీయేకు మళ్లీ 14 నుంచి 16 ఓట్లు తగ్గే ఛాన్స్ ఉంది.
గతంలో ఏప్రిల్ 17వ తేదీన జరిగిన ఓటింగ్‌లో అవసరమైన 352 ఓట్లు సాధించలేక ఈ బిల్లు వీగిపోవడం ఎన్డీయేను ఇంకా వెంటాడుతోంది. ఇప్పుడు మళ్లీ సభ ముందుకు వస్తున్న ఈ బిల్లు విషయంలో మోదీ సర్కార్ ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళుతుంది. ప్రాంతీయ పార్టీలను ఎలా ఒప్పిస్తుందనేది జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
