తెలంగాణ రాజధాని హైదరాబాద్ విస్తరణ, మౌలిక వసతుల కల్పనను మరింత స్పీడప్ చేయడమే టార్గెట్‌గా రేవంత్ సర్కార్ ఐఏఎస్, నాన్-కేడర్ అధికారుల పునర్వ్యవస్థీకరణను చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కీలకమైన హెచ్‌ఎమ్‌డీఏ, మెట్రో రైల్, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, జీహెచ్‌ఎంసీ వంటి కీలకమైన శాఖల్లో ఈ బదిలీలు( IAS Transfers) చోటు చేసుకున్నాయి. పాలనాపరమైన అవసరాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తమ జీవోలో పేర్కొన్నారు.
ఈ నియామకాల్లో ముఖ్యంగా హెచ్‌ఎమ్‌డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్‌ను మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్యదర్శిగా బదిలీ చేశారు. దీంతో పాటు గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలను ఇచ్చారు. ప్రస్తుతం మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఈవీ నరసింహారెడ్డిని హెచ్‌ఎమ్‌డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్‌గానూ నియమించారు. అలాగే నరసింహారెడ్డి మూసీ ప్రాజెక్ట్ ఎండీగా కూడా అదనపు బాధ్యతల్లో కొనసాగుతారు.
రాజధాని ట్రాన్స్‌పోర్టేషన్ రంగానికి కీలకమైన హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ బాధ్యతల్లో కూడా మార్పులు జరిగాయి. ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవో బి. అజిత్ రెడ్డికి మెట్రో రైల్ ఎండీగా ఫుల్ ఎక్స్‌ట్రా రెస్పాన్సిబిలిటీని అప్పగించారు. అలాగే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్ కలెక్టర్‌గా ఉన్న ఐ.ఈ.ఎస్.ఎస్.డి. మనోజ్‌ను మెట్రో రైల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇక జలమండలి జాయింట్ ఎండీ మయాంక్ మిట్టల్‌కు జీహెచ్‌ఎంసీ శంషాబాద్ జోనల్ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు.
అదే సమయంలో, శంషాబాద్ జోనల్ కమిషనర్‌గా ఉన్న కె. చంద్రకళను తాజాగా హెచ్‌ఎమ్‌డీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఆమెకు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (HGCL) భూసేకరణ ప్రత్యేక కలెక్టర్‌గా బాధ్యతలు ఇచ్చారు. విద్యారంగానికి సంబంధించి వరంగల్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ (State Audit) పి. రామును పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక అధికారిగా నియమించగా, ఇప్పటివరకు ఆ బాధ్యతల్లో ఉన్న వి. శ్రీనివాస్ రెడ్డిని మాతృశాఖకు పంపారు. నగరాభివృద్ధి ప్రాజెక్టులు వేగంగా సాగడానికి ఈ ఐఏఎస్ బదిలీలు ( IAS Transfers) ఎంతో తోడ్పడతాయని ప్రభుత్వం భావిస్తోంది.
