ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తయారీ సంస్థ బిస్లరీ(Bisleri) ఇంటర్నేషనల్‌పై ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టడానికి భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) అధికారిక అనుమతి మంజూరు చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయ్‌గురి జిల్లా తెలీపారా వద్ద ఉన్న బిస్లరీ ప్లాంట్ నుంచి అధికారులు సేకరించిన తాగునీటి నమూనాలను పరీక్షించగా, అందులో ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన కోలిఫామ్ బ్యాక్టీరియా ఉన్నట్లు స్పష్టమైంది. కేవలం వారం వ్యవధిలోనే ఈ ప్యాకేజ్డ్ వాటర్ బ్రాండ్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ న్యాయపరమైన చర్యలకు పర్మిషన్ ఇవ్వడం ఇది వరుసగా రెండోసారి కావడం గమనార్హం.
జల్‌పాయ్‌గురి యూనిట్ నుంచి తీసుకున్న బిస్లరీ (Bisleri) శాంపిల్స్‌ను ఫస్ట్ ప్రైమరీ ల్యాబ్‌లో, ఆ తర్వాత రెఫరల్ ల్యాబ్‌లో కూడా విశ్లేషించగా రెండింటిలో కూడా బ్యాక్టీరియా అనవాళ్లు బయటపడ్డాయి. సాధారణంగా డ్రైనేజీ లీకేజీలు లేదా డ్యామేజ్ అయిన పైప్‌లైన్ల గుండా నీటిలోకి ఈ బ్యాక్టీరియా ప్రవేశిస్తుంటుంది.
గతంలో గోవా యూనిట్‌కు చెందిన నీటి నమూనాలు కూడా ఆహార నాణ్యతా పరీక్షల్లో విఫలమయ్యాయి. ఆగస్టు 12వ తేదీన నాణ్యతా లోపాల కారణంగా ఒక బ్యాచ్ విక్రయాలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గతంలోనే బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే.
ఈసారి పరిశీలించిన నమూనాల్లో నిర్ణీత పరిమితికి మించి బ్రోమేట్‌తో పాటు పాలీన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు (PAH) ఆనవాళ్లు లభించాయి. ఇవి ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 నిబంధనలను డైరెక్టుగా ఉల్లంఘించడమేనని అధికారులు ప్రకటించారు.
బిస్లరీ(Bisleri) కంపెనీ అభ్యర్థనతో రెండో ల్యాబ్‌లో టెస్టింగ్ నిర్వహించినా నీరు అసురక్షితమైనదేనని రిపోర్ట్ వచ్చింది. అయితే తమ బ్రాండ్ నీరు పూర్తిగా సురక్షితమైనదని, అధికారులు జరిపే దర్యాప్తునకు సంపూర్ణంగా సహకరిస్తామని బిస్లరీ యాజమాన్యం వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ దేశవ్యాప్తంగా పానీయాల తయారీ ప్లాంట్లపై విస్తృత తనిఖీలు నిర్వహిస్తోంది.
