ఏపీలో కొద్ది రోజులుగా హోరాహోరీగా సాగిన స్థానిక సంస్థల పోరులో శబ్ద కాలుష్యానికి తెరపడింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించి ఈరోజు సాయంత్రం వరకూ విస్తృతంగా సాగిన మైకుల హోరు, ర్యాలీలు, బహిరంగ సభల సందడి.. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి క్లోజ్ అయింది. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారాన్ని ఆపేయాలన్న ఆదేశాలతో నాయకుల ప్రచార హోరుకు, మైకుల సౌండ్‌కు ఎండ్ కార్డ్ పడింది.
కాగా, ఓటింగ్ ప్రాసెస్ మొదలుకాక ముందే అధికార టీడీపీ,జనసేన,బీజేపీ ఎన్డీఏ కూటమి తన హవా చాటుకుంది. ఏపీ వ్యాప్తంగా ఏకంగా 17 మున్సిపల్ ఛైర్మన్ పీఠాలను అధికార కూటమి అకౌంట్లో వేసుకుంది. దీనిలో టీడీపీ 15 స్థానాలు గెలుచుకోగా, జనసేన, బీజేపీ తలో స్థానాన్ని సాధించాయి.
ముఖ్యంగా కడప జిల్లాలోనే 6 పట్టణ స్థానిక సంస్థలు ఏకగ్రీవం కావడం హాట్ టాపిక్ అయింది. దాంతో పాటు పిడుగురాళ్ల, ప్రొద్దుటూరు, రాయచోటి వంటి ప్రాంతాల్లో ఛైర్‌పర్సన్‌తో పాటు అన్ని వార్డులు కూడా ఎక్కడా పోటీ లేకుండా ఏకగ్రీవమయ్యాయి. మొత్తంగా 13 కార్పొరేషన్ల పరిధిలోని 118 డివిజన్లను కూటమి కేండిడేట్స్ దక్కించుకోవడంతో వైసీపీ శ్రేణులు షాకు నుంచి తేరుకోలేకపోతున్నారు.
కాగా నవంబర్ 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రాసెస్ జరగనుంది. ఓటర్లంతా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ఏపీ వ్యాప్తంగా 36,351 మంది బలగాలతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీటీవీలు, డ్రోన్ కెమెరాల నిఘాను ఏర్పాటు చేయడంతో పాటు వెబ్‌కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత నవంబర్ 3వ తేదీన కౌంటింగ్ చేపట్టి విజేతలను ప్రకటిస్తారు. శుక్రవారం సాయంత్రం నుంచి పార్టీల ప్రచారం ముగియడంతో ఇప్పుడు అందరి చూపు నవంబర్ 1వ తేదీన పడే ఓట్లు, నవంబర్ 3వ తేదీన రాబోయే ఫలితాలపైనే ఉంది.
