మేడ్చల్ మండల ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఉషిగారి దయానంద్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
ప్రధాన కార్యదర్శిగా ఎం.వి. శరత్ చంద్ర, ఉపాధ్యక్షులుగా నాగేష్, రాజశేఖర్, కోశాధికారిగా తాళ్లపల్లి విశ్వసాయి, గౌరవ అధ్యక్షుడిగా సత్యపాల్ రెడ్డి ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా గోపాల్, మహేష్, వెంకట్, రాకేష్, నవీన్, ఖాజా మోహినుద్దీన్, ప్రభాకర్, నక్షత్రం ఎంపికయ్యారు.
అధ్యక్షుడిగా ఎన్నికైన దయానంద్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. జర్నలిస్టుల హక్కులను పరిరక్షించడంతో పాటు వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. మీడియా ఐక్యతను బలోపేతం చేసి, జర్నలిస్టుల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ఎలక్ట్రానిక్ మీడియా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు, అధికారులకు మధ్య వారధిగా నిలుస్తూ బాధ్యతాయుతమైన వార్తా ప్రసారాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. నూతన కమిటీ జర్నలిస్టుల అభివృద్ధికి, వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
