విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన భార్య నారా భువనేశ్వరి శుక్రవారం కనక దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున దుర్గమ్మకు అత్యంత భక్తిశ్రద్ధలతో పట్టువస్త్రాలు, సారెను సమర్పించి ప్రత్యేక పూజలను నిర్వహించారు.దీనికి ముందు ఇంద్రకీలాద్రికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో పాటు ఆలయ కార్యనిర్వహణాధికారి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయ సాంప్రదాయ మర్యాదలతో సీఎం దంపతులను గర్భాలయానికి తీసుకుని వెళ్లారు. అక్కడ అమ్మవారిని దర్శించుకున్న చంద్రబాబు, భువనేశ్వరి.. ఏపీ ప్రజలందరూ సుభిక్షంగా, సిరిసంపదలతో వర్ధిల్లుతూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకున్నారు.దర్శనం ముగిసిన తర్వాత వేద పండితులు సీఎం దంపతులకు వేదాశీర్వచనం అందజేశారు. అలాగే అమ్మవారి తీర్థప్రసాదాలను, ప్రత్యేక జ్ఞాపికను వారికి బహుకరించారు. ప్రతి ఏటా దసరా నవరాత్రుల వేళ ప్రభుత్వ లాంఛనాలతో సీఎం స్వయంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పవిత్ర కార్యక్రమంలో ప్రముఖ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
