దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌కు నిరాశే మిగిలిందని విమర్శించారు.
తాజాగా కొన్ని కీలక రాష్ట్రాల్లో నిర్వహించిన శాసనమండలి (ఎమ్మెల్సీ) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. ఈ పరాజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ అసలు ఎన్ని ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించిందో ఒకసారి చూసుకోవాలంటూ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఘాటు కామెంట్లు చేశారు.
మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక వంటి నాలుగు పెద్ద రాష్ట్రాల్లో మొత్తం 28 శాసనమండలి స్థానాలకు ఈ ఎన్నికలు జరిగాయని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఎప్పుడు చూసినా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసే ప్రతిపక్షాలు కోరుకున్నట్లే.. ఈ ఎన్నికలలో పోలింగ్ అంతా పక్కాగా బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే జరిగిందని ఆయన గుర్తు చేశారు.
బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించినా కూవా కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవ్వడాన్ని ప్రధాని ఎద్దేవా చేశారు. ప్రజల సపోర్ట్ కోల్పోయిన కాంగ్రెస్‌ను బ్యాలెట్ పేపర్లు కూడా కాపాడలేకపోయాయని నరేంద్ర మోదీ విమర్శించారు. మొత్తంగా ఇప్పుడు మోదీ చేసిన ఈ సెటైరికల్ పోస్ట్ రాజకీయ వర్గాల్లో దుమారాన్ని రేపుతోంది.
