ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చి కొన్ని గంటలు గడిచిపోయినా రాజకీయ వర్గాల్లో రసవత్తర చర్చకు మాత్రం ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు. కూటమి క్లీన్ స్వీప్ చేసినా కొన్ని ప్రాంతాల్లో రెబల్స్, ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టించారు. పొత్తుల సద్దుబాటులో భాగంగా సీట్లు దక్కని అసంతృప్త నేతలు కొంతమంది బరిలో దిగి ఊహించని విజయాలను నమోదు చేశారు. మెయిన్‌గా కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ ఎన్నికల్లో జనసేన రెబల్ కేండిడేట్ క్రియేట్ చేసిన సంచలనం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
ఆదోని చైర్పర్సన్ స్థానం కూటమి సీట్ల కేటాయింపులో భాగంగా టీడీపీకి దక్కడంతో నాగమణిని తెలుగుదేశం పార్టీ బరిలో నిలిపింది. దీంతో జనసేన ఆదోని ఇన్చార్జి మల్లప్ప నాయకర్ తన భార్య స్వప్న మల్లప్ప నాయకర్ను ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దించారు. అలా ఉత్కంఠభరితంగా సాగిన మున్సిపల్ పోరులో స్వప్న ఏకంగా చైర్పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకుని హిస్టరీ క్రియేట్ చేశారు. ఈ విజయాన్ని తాము ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు బహుమతిగా ఇస్తున్నామని, పవన్ తనకు ఎప్పుడూ అండగా ఉన్నారని స్వప్న భర్త మల్లప్ప నాయకర్ మీడియా ముందు ప్రకటించారు.
కేవలం ఆదోనిలోనే కాకుండా ఏపీలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఇండిపెండెంట్ అభ్యర్థుల జోరు క్లియర్‌గా కనిపించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉండగా, ఏకంగా 10 వార్డుల్లో ఇండిపెండెంట్లు జయభేరి మోగించారు.
ఇక పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో కూడా ఇద్దరు జనసేన నుంచి, ఇద్దరు టీడీపీ నుంచి కలిపి మొత్తం నలుగురు రెబల్స్ ఇండిపెండెంట్లుగా నిలబడి 4 వార్డులను కైవసం చేసుకున్నారు. అదేవిధంగా ఏలూరు మున్సిపల్ ఎన్నికల్లో కూడా సుమారు ఎనిమిది మంది ఇండిపెండెంట్లు విజయాన్ని సాధించి తమ సత్తాను చాటారు.
పార్టీలకతీతంగా ఇలా స్థానిక ఓటర్లు రెబల్ కేండిడేట్స్ బ్రహ్మరథం పట్టడం, ప్రధాన పార్టీల అభ్యర్థులను వెనక్కి నెట్టడం లోకల్ పాలిటిక్స్‌లో కొత్త ఈక్వేషన్స్‌కు తెర తీసింది. కౌన్సిలర్ స్థాయి నుంచి మున్సిపల్ చైర్పర్సన్ పీఠం వరకు ఇండిపెండెంట్ అభ్యర్థులు సత్తా చాటడంతో రాబోయే రాజకీయ పరిణామాలు ఎలా మారబోతాయా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
