వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో మరోసారి పొలిటికల్ హీట్ తీవ్ర స్థాయికి చేరింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుండగా.. కొన్ని గ్రామాల్లో వైసీపీ, టీడీపీ వర్గాలు పరస్పరం దాడికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓటింగ్ ప్రారంభమైన కాసేపటికే కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద రెండు వర్గాల కార్యకర్తలు ఒకరితో ఒకరు తలపడటంతో పరిసర ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
పులివెందుల మండలంలోని ఆర్. తుమ్మలపల్లి గ్రామంలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తల మధ్య మొదలైన వాగ్వాదం క్షణాల్లోనే ఘర్షణకు దారితీసింది. రెండు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకోవడంతో కృష్ణారెడ్డి అనే వైసీపీ కార్యకర్త గాయపడ్డారు.
మరోవైపు లింగాల మండలం పార్నపల్లెలోని పోలింగ్ ఏజెంట్ల నియామకంపైన వివాదం చెలరేగింది. తమ ఏజెంట్లు ఎవరినీ కూడా పోలింగ్ కేంద్రంలోకి రానివ్వడం లేదంటూ వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ విషయం తెలుసుకుని అక్కడికి చేరుకుంటున్న ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు మధ్యలోనే అడ్డుకోవడంతో అక్కడి వాతావరణం మరింత వేడెక్కింది.
ఇక పెద్దముడియం మండలం గుండ్లకుంటలో వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి జోక్యం చేసుకుని టీడీపీ ఏజెంట్లను బయటకు పంపించారనే ఆరోపణలతో రెండు వర్గాల మధ్య పెద్దగా తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.ఎర్రిపల్లిలో అయితే పోలీసులే ఓటర్లను అడ్డుకుంటున్నారనే ప్రచారం జోరుగా జరగడంతో కొంతసేపు గందరగోళం నెలకొంది. వరుస ఘర్షణల వల్ల ఎన్నికల యంత్రాంగం, పోలీసు శాఖ వెంటనే అలర్ట్ అయ్యాయి. తాజా పరిస్థితులతో పులివెందుల నియోజకవర్గంలో ఉన్న అన్ని సమస్యాత్మక గ్రామాల్లో అదనపు బలగాలను మోహరించి, పరిస్థితిని కంటిన్యూగా పర్యవేక్షిస్తున్నారు.
