తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇటీవల రిలీజ్ డేట్స్‌లో మార్పులు, వాయిదాల వ్యవహారం తరచూ ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. ముందుగా ప్రకటించిన తేదీలకు సినిమాలు థియేటర్లలోకి రాకపోవడంతో అభిమానుల్లో ఆసక్తితో పాటు కొంత నిరాశ కూడా కనిపిస్తోంది. ఏవైనా అనివార్య కారణాలు ఉన్నా సరే, ఎదురుచూసే ఆడియన్స్‌కు మాత్రం రిలీజ్ డేట్లలో వస్తున్న మార్పులు కొత్త ఉత్కంఠను కలిగిస్తున్నాయి.
ఈ క్రమంలో వచ్చే ఏడాది విడుదల కావాల్సిన కొన్ని బడా చిత్రాలు మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఒక పెద్ద సినిమా విడుదల తేదీ మారితే దాని ప్రభావం డైరెక్టుగా మరో సినిమా రిలీజ్ ప్లాన్‌పై పడుతుండటంతో టాలీవుడ్ బాక్సాఫీస్ లెక్కలు మారిపోతున్నాయి. మరి ఈ వాయిదా ప్రచారంలో ఏయే సినిమాలున్నాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న విశ్వంభర మూవీ రిలీజ్ డేట్‌పై తాజాగా మరో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుందంటూ కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తూ వచ్చాయి. కానీ తాజా బజ్ ప్రకారం విశ్వంభర సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. జనవరిలో కాకుండా మార్చి 19న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ దాగి ఉంది. అదే మార్చి 19వ తేదీని ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా ఇప్పటికే రిలీజ్ డేట్‌గా లాక్ చేసుకుంది. దీంతో చిరంజీవి విశ్వంభర, ప్రభాస్ ఫౌజీ బాక్సాఫీస్ వద్ద ఎదురుపడతాయా అనే చర్చ అభిమానుల్లో జోరుగా సాగుతోంది.
అయితే మరోవైపు ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ చిత్రం కూడా మరోసారి పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని మరో ప్రచారం ఊపందుకుంది. ఈ సినిమాను మార్చి 19 నుంచి ఏప్రిల్ 7కి షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడ గమనించదగ్గ మరో కీలక విషయం ఏమిటంటే, మహేశ్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి చిత్రం ఇప్పటికే ఏప్రిల్ 7 తేదీని ఖరారు చేసుకుంది.
ఫౌజీ కూడా అదే తేదీని ఎంచుకుంటే వారణాసి రిలీజ్ డేట్లో మార్పులు ఉంటాయా అనే కొత్త సందేహం సినీ వర్గాల్లో మొదలైంది. ఈ పరిణామాలన్నీ ఇండస్ట్రీలో కొత్త చర్చలకు తెరలేపాయి. అయితే ఈ సినిమాల నిర్మాతల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇవి కేవలం ప్రచారాలు మాత్రమే అయినా, రాబోయే రోజుల్లో రిలీజ్ డేట్లలో మరిన్ని ఆసక్తికరమైన మార్పులు జరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
