పట్టణ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో వార్ వన్ సైడ్… గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అలా లేని పరిస్ధితి. తొలి విడత పంచాయతీల్లో దాదాపు 1100 మంది వైసీపీ మద్దతుదారులు సర్పంచులుగా ఎన్నికైన వైనం. పార్టీ గుర్తులతో జరిగిన ఎన్నికల్లో కూటమి హవా చూపిస్తే.. పార్టీ గుర్తులు లేని చోట అంత లేకపోవడం దేనికి సంకేతం? చాలా చోట్ల అపశృతులు… అసంతృప్తులు ఉన్నా పొత్తులు ఫలించాయి. కాని పంచాయతీ ఎన్నికల్లో పొత్తులకు సంబంధం లేదు.. పార్టీలకు సంబంధం లేదు.. గుర్తులు లేనే లేవు… అక్కడ మాత్రం వైసీపీ మరీ దారుణంగా దెబ్బ తినకుండా కాస్త బెటర్ గానే దాని మద్దతుదారులు గెలిచినట్లు ఇప్పటికే వైసీపీ మీడియా గట్టిగానే సౌండ్ చేస్తోంది. దీని నుంచి కూటమి నాయకులు తెలుసుకోవాల్సినదేంటి?
రాష్ట్రంలో కూటమిపై వ్యతిరేకత లేదు.. కూటమి అధినేతలపై వ్యతిరేకత లేదు.. ప్రభుత్వంపై అసంతృప్తి తప్పితే వ్యతిరేకత లేదు.. కాని ఎమ్మెల్యేలపై మాత్రం విపరీతమైన అసంతృప్తి, వ్యతిరేకత ఉన్నాయి. అందుకే మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో పార్టీ గుర్తు ఉన్నవారికి ఓటేసిన ప్రజలు… పంచాయతీల్లో మాత్రం ఆ ఎమ్మెల్యేలే చెప్పినా కూడా వినకుండా తమకు నచ్చినవారికి వేసుకున్నారు. అంటే లోకల్ గా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో తెలుసుకోవాల్సిన పరిస్ధితి కూటమికి వచ్చిందనే చెప్పాలి. తెలుసుకోనక్కర్లేదు కూడా.. అనేకసార్లు చంద్రబాబునాయుడు గారే ఎమ్మెల్యేలకు వార్నింగులు ఇచ్చారు. అవన్నీ పైకి షో చేయడానికే ఇచ్చారని అనుకోవాలి.. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరిమీదా చర్యలు లేవు. కేవలం వార్నింగులు, డైలాగులు మాత్రమే వదిలారు.
ఇసుక, లిక్కర్ ఒకటి కాదు.. ఎమ్మెల్యేలు చాలా మంది తమ నియోజకవర్గాలు తమ సామంత రాజ్యాల్లా ఫీలవుతున్నారు. ప్రతి వ్యాపారంలోనూ వేలు పెడుతూ కమీషన్లు లాగుతున్నారనే ఆరోపణలు గట్టిగా ఉన్నాయి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ గుంజడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు. అందుకే ప్రజల్లో ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత కనపడుతోంది. కొంతమందికి మాత్రమే ఈ విషయంలో మినహాయింపు ఇవ్వొచ్చు. కాని చాలామంది మాత్రం అదే దారిలో నడుస్తున్నారు. అవినీతి మాత్రమే కాదు.. అవినీతిని ప్రశ్నించినవారిని ఇబ్బంది పెడుతున్నారు. కేసులు పెడుతున్నారు. వేధిస్తున్నారు. ప్రజలకు ఏం కావాలన్నా పెయిడ్ సర్వీసుల్లా చేయడం తప్పితే నిజాయితీగా వారికి సేవలు చేసే ఎమ్మెల్యేలు అరుదైపోయారు. ఏ ప్రాంతమూ దీనికి మినహాయింపు కాదు. ఉత్తరాంధ్ర, గోదావరి, అమరావతి, రాయలసీమ అన్ని జోన్లలోనూ ఇదే సీన్. టీడీపీ, జనసేన, బీజేపీ అన్ని పార్టీల ఎమ్మెల్యేలు అదే పరిస్ధితి. వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలతో చేయి కలిపి వారి పనులు వారి చేయించుకుంటున్నారు. చెల్లిస్తే చాలు చెలిమికి అడ్డు లేదన్నట్లు అధికార పార్టీ నేతలు వ్యవహారాలు నడిపిస్తున్నారు.
ఈ వ్యవహారాలు చూసి చాలామంది అధికార పార్టీ కేడర్ కోపంగా ఉన్నారు. ఇక టీడీపీ, జనసేన మధ్య కూడా గ్రౌండ్ లెవెల్లో బాగోలేదు. టీడీపీ నేతలు తొక్కేస్తున్నారని జనసేన నేతలు… జనసేన వాళ్లు గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారని టీడీపీ వాళ్లు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. అయినా మున్సపల్, పరిషత్ ఎన్నికల్లో అధినేతల ఆదేశాలను మన్నించి పని చేసి గెలిపించుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో… పార్టీ గుర్తులే లేకపోవడంతో.. ఎవరిష్టమొచ్చినట్లు వాళ్లు చేసుకున్నారు. అయినా కూటమి మద్దతుదారులకు అధిక సర్పంచ్ స్థానాలు దక్కడానికి కారణం కూటమి పార్టీల సంస్థాగత బలంతో పాటు.. అధికారంలో ఉండటం కూడా కారణం. ఇకనైనా కూటమి నేతలు మేలుకుని ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయకపోతే.. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్ధులను మార్చినా ప్రజలు నమ్మే పరిస్ధితి ఉండదు.
