డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలు చాలాకాలంగా వ్యక్తం చేస్తున్న ఆందోళనలకు స్వస్తి పలుకుతూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ స్థానాల విభజన జరిగితే కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన తమకు సీట్ల సంఖ్య తగ్గి ప్రాతినిధ్యం పడిపోతుందనే భయాలను తొలగించడానికి కేంద్రం సరికొత్త సవరణ ఫార్ములాను తెరపైకి తెచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సేవాతీర్థ్‌లో సమావేశమైన కేంద్ర కేబినెట్.. అన్ని రాష్ట్రాల్లోనూ లోక్‌సభ సీట్ల సంఖ్యను ఏకరీతిగా 50 శాతం పెంచేందుకు ఆమోదముద్ర వేసినట్లు సమాచారం.
ఈ సవరించిన ప్రతిపాదన ప్రకారం, ప్రతి రాష్ట్రంలోనూ ఉన్న ప్రస్తుత సీట్ల నిష్పత్తి మారకుండానే సమానంగా 50 శాతం స్థానాలు పెరుగుతాయి. అంతేకాకుండా ఈ పెంచిన సీట్ల అమరికను మరో 25 ఏళ్ల పాటు అంటే 2051 వరకు యథాతథంగా కొనసాగించేలా (ఫ్రీజ్ చేసేలా) సవరణలకు పచ్చజెండా ఊపారు. అంటే భవిష్యత్తులో జనాభా ప్రాతిపదికన దక్షిణాది రాజకీయ ప్రాబల్యం తగ్గకుండా రక్షణ లభించనుంది. దీనికితోడు 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు పక్కాగా అమలు చేయాలనే పట్టుదలతో ఉన్న మోదీ సర్కార్, దానికి ముడిపడి ఉన్న రాజ్యాంగ సవరణ బిల్లులోనూ అవసరమైన మార్పులకు ఆమోదం తెలిపింది.
రాజ్యాంగ 131వ సవరణ బిల్లు ద్వారా లోక్‌సభ గరిష్ఠ స్థానాల పరిమితిని ప్రస్తుతమున్న 550 నుంచి ఏకంగా 850కి పెంచేలా డిజైన్ చేశారు. ఇందులో రాష్ట్రాలకు గరిష్ఠంగా 815 సీట్లు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 సీట్లు కేటాయించే ప్లాన్ ఉంది. అయితే ఈ రాజ్యాంగ సవరణ బిల్లు చట్టంగా మారాలంటే లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీ (హాజరైన వారిలో) తప్పనిసరి. ప్రస్తుతం సభలో ఉన్న 543 స్థానాల లెక్క ప్రకారం కనీసం 361 మంది సభ్యుల అనుకూల ఓటు అవసరమవుతుంది. గత ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో సంఖ్యాబలం తగినంత లేకపోవడంతో ఈ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే.
సభలో బిల్లును గట్టెక్కించడమే లక్ష్యంగా ఇప్పుడు విపక్షాల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని కేంద్రం సవరణలు చేపట్టింది. ఈ క్రమంలో 22 మంది ఎంపీలున్న డీఎంకే, 8 మంది ఎంపీలున్న ఎన్సీపీ (శరద్ పవార్) వర్గాల మద్దతు ఇప్పుడు ప్రభుత్వానికి అత్యంత కీలకంగా మారింది. ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశముంది. నవంబర్ 30న లోక్‌సభ, డిసెంబర్ 2న రాజ్యసభ భేటీలు ప్రారంభమై డిసెంబర్ 3న ముగుస్తాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ఈ సవరణల అనంతరం సభలో సమీకరణలు ఎలా మారతాయో వేచి చూడాలి.
