ఏపీ వ్యాప్తంగా జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రిజల్ట్ ( Parishad Election Results) పొలిటికల్ వర్గాల్లో ఊహించని స్థాయిలో వేడి పుట్టించింది. ఎక్కడ చూసినా హోరాహోరీ పోరు, ఉత్కంఠ రేపే మలుపులు, కొన్నిచోట్ల కేవలం ఒక్క ఓటు తేడాతో గెలుపోటములు తేలడం కనిపించింది. మరికొన్ని ప్రాంతాల్లో రీకౌంటింగ్ రచ్చ, పోలీసులతో తోపులాటల మధ్య పరిషత్ ఫలితాలు సరికొత్త రాజకీయ సమీకరణాలకు దారితీశాయి.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు జడ్పీటీసీ స్థానంలో టీడీపీ విజయబావుటా ఎగురవేసింది. టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ ఇక్కడ ఘన విజయాన్ని సాధించడంతో నియోజకవర్గ వ్యాప్తంగా పరిటాల అభిమానులు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ సంబురాలు జరుపుకున్నారు. ఇక వైఎస్సార్ జిల్లాలో చాలామంది దృష్టిని ఆకర్షించిన వైసీపీ కంచుకోట పులివెందుల జడ్పీటీసీ స్థానంలో.. టీడీపీ అభ్యర్థి ఏకంగా 1,463 ఓట్ల మెజార్టీతో సంచలన విజయాన్ని సాధించడం జగన్ వర్గీయులకు కోలుకోలేని దెబ్బగా మిగిలింది.
అటు పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మల్లిపూడి జెడ్పీటీసీ ఎన్నికల లెక్కింపులో పరాకాష్ట స్థాయి ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి కొల్లి అరుణ కుమారి కేవలం ఒక్క ఓటు తేడాతోనే విజయం సాధించారు. రిజల్ట్‌పై అనుమానంతో వైసీపీ శ్రేణులు రీకౌంటింగ్ కోరగా, అధికారులు మళ్లీ లెక్కించినా కూడా చివరకు అప్పుడు కూడా అదే ఒక్క ఓటు ఆధిక్యంతో అరుణ కుమారి విజయం ఖరారైంది.
అలాగే కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో మాత్రం ఒకే ఫ్యామిలీలో డబుల్ ధమాకా సీన్ కనిపించింది. ప్రత్తిపాడు-2 నుంచి యాళ్ల జగదీష్ (1,336 మెజారిటీ), ప్రత్తిపాడు-3 నుంచి ఆయన సతీమణి యాళ్ల మంగాదేవి (1,138 మెజారిటీ) ఎంపీటీసీలుగా గెలిచి రికార్డు విజయాన్ని నమోదు చేశారు.
కృష్ణా జిల్లా గన్నవరం జెడ్పీటీసీ స్థానంలో మాత్రం వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు అనగాని రవి (వైసీపీ) 137 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే ఈ కౌంటింగ్‌పై అనుమానాలు ఉన్నాయంటూ కూటమి నేతలు రీకౌంటింగ్ కోసం పట్టుబట్టడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అధికారులు ముందస్తుగా తలుపులు మూసివేశారు. అలాగే తిరుపతి జిల్లా రైల్వేకోడూరులో అవకతవకలు జరిగాయంటూ మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నిరసనకు దిగగా, పోలీసులతో తోపులాట చోటుచేసుకుంది.
విజయనగరం జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రిజల్ట్ ( Parishad Election Results)వల్ల బొత్స ఫ్యామిలీలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. తెర్లాంలో బొత్స చిన్న శీను కుమార్తె మజ్జి సిరి సహస్ర, గరివిడిలో కోడలు పూజిత ఆధిక్యంలో నిలవగా.. బొండపల్లిలో కుమార్తె అనూష పరాజయం పాలయ్యింది. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లా క్రిష్ణగిరి జెడ్పీటీసీ స్థానంలో ప్రధాన పార్టీల హేమాహేమీలను తట్టుకుని ఇండిపెండెంట్ కేండిడేట్ శ్రీరాములు అనూహ్య విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
