ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే గెలిచిన అభ్యర్థి పేరు వినడానికి ఊరంతా ఉత్కంఠగా ఎదురుచూసింది. ఎన్నికల అధికారులు ఫలితాన్ని ప్రకటించగానే మామూలుగా అయితే విజయోత్సవ సంబరాలు మిన్నంటాలి. కానీ అక్కడ మాత్రం ఎలాంటి సంతోషం కూడా లేదు. కనీసం బాణాసంచా కాల్చడానికి కూడా ఎవరికీ మనస్కరించలేదు. తాను పోటీ చేసిన స్థానంలో ప్రజలంతా తనను నమ్మి ఓట్లేసి గెలిపించినా.. ఆ విజయం తాలూకా ఆనంద క్షణాలను ఆస్వాదించడానికి ఆ అభ్యర్థి భౌతికంగా ఈ లోకంలో లేకుండాపోవడంతో ఇప్పుడు స్థానికులను కన్నీటిపర్యంతం చేస్తోంది.
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలోని ధుమంతునిగూడెం గ్రామానికి చెందిన గారపాటి దివ్య (28) జనసేన పార్టీ తరఫున ఎంపీటీసీ కేండిడేట్గా బరిలోకి దిగారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి, ఊరి డెవలప్మెంట్కి నిత్యం కష్టపడే దివ్య.. ప్రచారంలో కూడా అంతో చురుగ్గా పాల్గొన్నారు. అయితే కౌంటింగ్ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందే ఆమె ఊహించని విధంగా గుండెపోటుకు గురై కన్నుమూశారు. తీరా లెక్కింపు ముగిసిన తర్వాత అధికారులు ఫలితాలను వెల్లడించగా, వైసీపీ కేండిడేట్పై ఏకంగా 352 ఓట్ల మెజారిటీతో దివ్య ఘన విజయాన్ని సాధించినట్లు తేలింది.
తన పట్టుదలతో స్థానికుల మనసులు గెలుచుకుని, ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించినా .. ఆ నవ్వును చూడటానికి ఆమె లేకపోవడం తన కుటుంబ సభ్యులను, గ్రామస్థులను గుండెలవిసేలా చేస్తోంది. ప్రేమ వివాహం చేసుకున్న దివ్యకు ఐదేళ్ల బాబు, కేవలం మూడు నెలల వయసున్న బాబు ఉన్నారు. తల్లి ప్రేమకు నోచుకోకుండా ఆ పసిపిల్లలు మిగిలిపోవడంతో ధుమంతునిగూడెం గ్రామంలోని ప్రతి ఒక్కరినీ తీవ్రంగా బాధిస్తోంది. ప్రజాసేవ చేయాలని కలలు కని విజయాన్ని ముద్దాడిన యంగ్ లీడర్ అకాల మరణం చెందడంతో ఊరిలో ఆనందానికి బదులు మిన్నంటిన విషాద ఛాయలే కనిపిస్తున్నాయి.
