ప్రతిసారీ బంగాళాఖాతంలోనో లేదంటే అరేబియా సముద్రంలోనో కొత్త తుపాను రూపుదిద్దుకోగానే దానికి హుద్ హుద్, అర్నబ్, తేజ్, గతి అంటూ విచిత్రమైన పేర్లు పెట్టడం మనం చూస్తుంటాం. అసలు ఈ పేర్లు ఎవరు పెడతారు.. ఏ ప్రాతిపదికన ఈ నామకరణం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. నిజానికి సముద్రంలో పుట్టే వైపరీత్యాలకు పేర్లు పెట్టే ప్రాసెస్ వెనుక.. ఒక పెద్ద గ్లోబల్ వ్యవస్థ, పక్కాగా రూపొందించిన నిబంధనల లిస్ట్ ఉందనేది ఆసక్తికరమైన నిజం.
విపత్తు సమయాల్లో టెక్నికల్ నెంబర్స్ లేదా అక్షాంశ-రేఖాంశాల కొలతల కంటే ఒక కచ్చితమైన పేరు ఉంటే ప్రజలకు అవగాహన కల్పించడానికి రేడియోలు, టీవీల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేయడానికి ఈజీ అవుతుంది. అందుకే ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) నేతృత్వంలోని 13 దేశాలు కలిసి దీనిని షేర్ చేసుకుంటాయి.
భారతదేశంతో పాటు బంగ్లాదేశ్, ఇరాన్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, శ్రీలంక, థాయిలాండ్, సౌదీ అరేబియా,యూఏఈ,పాకిస్తాన్, ఖతార్, యెమెన్ దేశాలు ఈ ప్యానెల్లో సభ్యులుగా ఉన్నాయి. ఈ 13 దేశాలలో ఒక్కో దేశం 13 పేర్లను ప్రతిపాదిస్తాయి. అలా మొత్తం 169 పేర్లతో కూడిన ఒక భారీ జాబితాను సిద్ధం చేశారు. న్యూఢిల్లీలోని భారత వాతావరణ శాఖ (IMD) అంతర్జాతీయ వరుస క్రమాన్ని బట్టి సముద్రంలో గాలుల వేగం గంటకు 62 కి.మీ. దాటగానే లిస్ట్‌లోని తర్వాత పేరును ఖరారు చేస్తుంది.
ఈ పేర్లు పెట్టడానికి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఎవరి మతపరమైన, రాజకీయాలు, లింగపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఈ పేరు ఉండకూడదు. పలకడానికి ఈజీగా ఉంటూ 8 అక్షరాలకు మించకుండా ఉండాలి. అన్నింటికంటే ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, ఒకసారి ఉపయోగించిన పేరును మళ్లీ తిరిగి ఎప్పటికీ వాడరు. రికార్డుల్లో గందరగోళం లేకుండా ఉండటానికే ఈ పక్కా నియమాన్ని పెట్టారు.
భారత్ కూడా ప్రకృతి, సంస్కృతి, మన భాషల గొప్పతనాన్ని చాటిచెప్పేలా 13 పేర్లను ఈ లిస్ట్‌కు అందించింది. దీనిలో మొదటి రెండు పేర్లయిన గతి (వేగం) అలాగే తేజ్(ప్రకాశం)పేర్లను.. తుపానులకు ఇప్పటికే వాడేశారు.
భవిష్యత్తులో భారత దేశం వంతు వచ్చినప్పుడు రాబోయే తుపానులకు మురసు (తమిళ సాంప్రదాయ డ్రమ్), వ్యోమ్ (ఆకాశం), జార్ (జలపాతం), అంబుద్ (మేఘం), జలధ్ (సముద్రం), ప్రబాహో (ప్రవాహం), నీర్ (నీరు), ప్రభంజనం (విధ్వంసకర గాలి), ఘూర్ణి (సుడిగాలి), వేగ (అత్యంత వేగం), ఆగ్ (నిప్పు) అనే క్రేజీ పేర్లను కూడా పెట్టబోతున్నారు.
