మేమేం తక్కువ తినలేదు.. మేం కూడా వైసీపీ అడుగుజాడల్లోనే నడుస్తామని టీడీపీ చెప్పకనే చెప్పినట్లయింది. ఒకవైపు సీఎం చంద్రబాబు సుభాషితాలు చెబుతూనే ఉన్నారు. మరోవైపు టీడీపీ నేతలు, కార్యకర్తలు చేయాల్సింది చేసుకుంటూ పోతున్నారు. చివరకు చంద్రబాబే వారి దారిలోకి వచ్చినట్లున్నారు. గత స్థానిక ఎన్నికల్లో టీడీపీ వారిని నామినేషన్లు వేయనిచ్చారా అని ప్రశ్నిస్తున్నారు.
అయితే ఏకగ్రీవాల విషయంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు అర్ధమవుతోంది. ఉత్తరాంధ్ర, కోస్తాలలో ఈ గొడవ లేదు. నామినేషన్లు ఆపినట్లు ఆరోపణలు లేవు. కాని రాయలసీమలో మాత్రం గట్టిగా వచ్చాయి. రాయలసీమలోనే వైసీపీ బలం ఉన్నది. అక్కడ కూడా అసెంబ్లీలో ఎన్నికల్లో ఓడిపోయినా.. పర్సేంటేజీలు చూస్తే ఇక్కడే ఓట్లు ఎక్కువగా ఉన్నాయి.
అందుకే రాయలసీమలో దెబ్బ కొడితే.. మళ్లీ కోలుకోకుండా చేయొచ్చనేది టీడీపీ వ్యూహంగా కనపడుతోంది. అందుకే రాయలసీమలో వైసీపీ బలంగా ఉన్న కడప, అనంతపురం, చిత్తూరు తర్వాత కర్నూలులోను గట్టిగా ఫోకస్ చేసింది టీడీపీ. ఏకగ్రీవాలు అయ్యేటట్లు బలంగా ప్లాన్ చేసింది. మున్సిపల్ ఛైర్ పర్సన్లు, వార్డులు, ఆఖరికి ఎంపీటీసీలు కూడా ఏకగ్రీవాలు వచ్చాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు రాకపోతే ఇంకా భారీ సంఖ్యలో ఇవి ఉండేవనడంలో సందేహం లేదు.
దీని వలన వైసీపీ నేతలు, కార్యకర్తల్లో నిరాశ కనపడుతోంది. ఇలా అయితే మళ్లీ పుంజుకోగలమా అనే డౌట్లు పెరిగిపోయాయి. మొన్నటివరకు జగన్ ఏదో ఒక పేరుతో చేసిన యాత్రలకు జనం ఎగబడినట్లుగా క్రియేట్ చేసుకున్నారు. దీంతో జగన్ కు క్రేజ్ తగ్గలేదని.. జగన్ అంటే కూటమి భయపడుతుందని.. మళ్లీ జగన్ వచ్చేస్తాడంటూ ప్రచారాన్ని పీక్స్‌కు తీసుకెళ్లారు. వైసీపీ అభిమానుల్లో కొందరు ఈ విషయాన్ని నమ్మారు కూడా. అయితే ఆ నమ్మకాన్ని వమ్ము చేసే లక్ష్యంగా టీడీపీ పావులు కదిపింది.
వైసీపీ బలంగా ఉందనుకుంటున్న ప్రాంతాల్లోనే ఏకగ్రీవాలు చేయటం ద్వారా అంత బలం లేదని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే అక్రమాల విషయంలో చంద్రబాబు పైకి బయటపడరు గాని.. లోలోపల చేయిస్తారని ఇప్పటి వరకూ ఉన్న పేరు.. ఈసారి ఆ పేరు పోయి.. చంద్రబాబు కూడా ఓపెన్ హంటింగ్ చేసేశారనే టాక్ వచ్చేసింది. ఇది టీడీపీ అభిమానుల్లో కూడా చర్చ రేపింది. అంతే కాదు.. జనసేనకు పొత్తులో ఇఛ్చిన చోట కూడా తెలుగు తమ్ముళ్లు నామినేషన్లు వేయనీయకుండా అడ్డుపడిన ఘటనలు కలకలం రేపాయి. అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గరే గట్టి పట్టు పట్టడంతో… అవి కాస్త తగ్గుముఖం పట్టాయి.
