ఏపీ పొలిటికల్ కేపిటల్ అని అంతా పిలుచుకునే సాగరతీరం.. విశాఖపట్నం ఇప్పుడు మరోసారి రాజకీయంగా వేడెక్కింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) ఎలక్షన్ నగారా మోగడంతో మేయర్ పీఠాన్ని సొంతం చేసుకోవడానికి మెయిన్ పార్టీలు పొలిటికల్ స్ట్రాటజీలకు పదును పెడుతున్నాయి.
ఈసారి మేయర్ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయిస్తూ రిజర్వేషన్ ఫిక్స్ చేయడంతో పోటీ వాతావరణం ఒక్కసారిగా పీక్స్‌కు చేరింది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ రెండు పక్షాల అధినేతలు గెలుపు గుర్రాలను పోటీలోకి దించడానికి సామాజిక సమీకరణాలపై బిజీబిజీగా లెక్కలు వేస్తున్నారు. దీంతో విశాఖ టాప్ లీడర్ల సర్కిల్స్‌లోనూ, సోషల్ మీడియా వేదికగానూ మేయర్ అభ్యర్థుల పేర్లు మార్మోగిపోతున్నాయి.
అధికార కూటమి వైపు చూస్తే టీడీపీ నుంచి కొన్ని ఊహించని పేర్లు తెరపైకి వస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు, విశాఖ ఎంపీ శ్రీభరత్ భార్య నందమూరి తేజస్విని పేరు బలంగా వినిపిస్తుండటం విశేషం. దీంతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు భార్య లావణ్య పేరు కూడా వినిపిస్తుంది.
వీరితో పాటు మాజీ కార్పొరేటర్ ముక్కా శ్రావణి, సిటీలోని మరో ఫేమస్ బిజినెస్ మెన్ కుమార్తె పేర్లు కూడా పరిశీలిస్తున్నట్లు న్యూస్ వినిపిస్తుంది. ఇవన్నీ ప్రస్తుతానికి ప్రచారంలో ఉన్న పేర్లే అయినా కూడా, అధికార పార్టీ మాత్రం నియోజకవర్గాల వారీగా సమీక్షించి ఫైనల్ కేండిడేట్‌ను అనౌన్స్ చేయనుంది.
ఇక వైఎస్సార్సీపీ విషయానికి వస్తే మేయర్ సీటు సాధించి తీరాలనే కసిలో ఉంది. సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ భార్య, మాజీ ఎంపీ అయిన బొత్స ఝాన్సీ పేరు వైఎస్సార్సీపీ రేసులో ముందు ఉంది. పొలిటికల్‌గా ఆమెకున్న అనుభవం పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారు. ఆమెతో పాటు మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ భార్య హిమగౌరి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, అనకాపల్లి మాజీ ఎంపీ బీశెట్టి సత్యవతి పేర్లు కూడా లిస్టులో ఉన్నాయి.
విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ చరిత్ర చూస్తే ఇప్పటివరకు ఇద్దరు మహిళలు మాత్రమే మేయర్‌గా చేశారు. జీవీఎంసీగా మారక ముందు కాంగ్రెస్ నుంచి రాజాన రమణి, రీసెంట్గా 2021 నుంచి వైఎస్సార్సీపీ తరఫున గొలగాని హరి వెంకట కుమారి బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు రాబోయేది విశాఖకు మూడో మహిళా మేయర్ కావడం, అందులోనూ హేమాహేమీల కుటుంబాల పేర్లే వినిపిస్తూ ఉండటంతో.. ఈసారి ఎన్నికల ఫైట్ మామూలుగా ఉండదని తెలుస్తోంది.
