తిరుపతి–తిరుమల ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.3,222 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. భక్తుల సేవల కోసం రూపొందించిన ‘వెంకటాద్రి’ యాప్ను ఆవిష్కరించారు.
అలిపిరి సమీపంలో రూ.2,750 కోట్లతో సమీకృత యాత్రికుల టౌన్షిప్ నిర్మించనున్నారు. ఇందులో 2,700 గదులు, అన్నప్రసాద కేంద్రం, బహుళ అంతస్తుల పార్కింగ్, బస్ టెర్మినల్, వైద్య సేవలు ఏర్పాటు చేయనున్నారు. టీటీడీ ఉద్యోగుల గృహ స్థలాల అభివృద్ధికి రూ.230 కోట్లు కేటాయించారు. ఉద్యోగులకు కేటాయించిన 5,192 గృహ స్థలాల్లో రహదారులు, డ్రైనేజీ, నీటి సరఫరా వంటి సదుపాయాలు కల్పించనున్నారు.
తిరుపతి నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు రూ.242 కోట్లతో తొమ్మిది మాస్టర్ ప్లాన్ రహదారులు నిర్మించనున్నారు. చెరువుల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, పర్యాటకం, యువతకు ఉపాధి అవకాశాల పెంపుపై సీఎం అధికారులకు సూచనలు చేశారు. ఆధ్యాత్మికతతో పాటు ఆధునిక సౌకర్యాలను అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
