ఏపీలో ఏంటీ రాజకీయాలు… అధికార, ప్రతిపక్ష పార్టీల విన్యాసాలు చూస్తుంటే కాస్త ఇరిటేషన్ కలుగుతోంది. లోకేష్ ను టార్గెట్ చేయాలని జగన్… దానిని తిప్పికొట్టాలని లోకేష్… వీరిద్దరి వ్యూహ ప్రతి వ్యూహాల మధ్య పోలీసులకు పని పెట్టడం.. మీడియాకు, జనాలకు టైమ్ పాస్ చేయడంలా తంతు నడుస్తోంది. ఎక్కడైనా ఏదైనా ఆందోళన చేపట్టాలంటే బాధితులు ముందుకు రావాలి.. కాని వైసీపీ ఆందోళనల్లో ఉద్యోగం రాలేదనే అభ్యర్ధులు కనపడరు… టీడీపీ కౌంటర్ నిరసనల్లోనూ టీచర్లు కనపడేది తక్కువ.. వాళ్లు కూడా టీడీపీ మద్దతుదారులే. సబ్జెక్ట్ మాత్రం ఉద్యోగాలు రానివాళ్లది.. వచ్చినవాళ్లది. వారికి సంబంధం లేకుండా కేవలం రాజకీయంగా వైసీపీ దాడి చేయాలని చూస్తుంటే.. టీడీపీ ప్రతిదాడి చేస్తోంది. ఉద్యోగాలు రాని వారిని.. వచ్చినవాళ్లని వారి వారి స్నేహితులు, బంధువులు ఏంటి నీకు ఉద్యోగం అర్హత లేక రాలేదా…. ఏంటి నీకు ఉద్యోగం డబ్బులిస్తే వచ్చిందా అంటూ అడుగుతుంటే సమాధానాలు చెప్పుకోలేక నానా యాతన పడుతున్నారు.
అసలైతే జగన్ తన హయాంలో డీఎస్సీ పెట్టలేదు. ఖాళీలు ఉన్నా వదిలేశారు. వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను చూపించి అవే ఉద్యోగాలని చెప్పారు. కాని డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులను 5 వేల జీతానికి వలంటీర్ పని చేసుకోమన్నట్లు అయింది. పాపం చాలామంది అదే పని చేశారు కూడా. యువతలో ఈ అసంతృప్తి గమనించే టీడీపీ తెలివిగా డీఎస్సీ పెడతామని.. అది కూడా ప్రతి పేడాది పెడతామని హామీ ఇచ్చింది. దానిని అమలు చేస్తూ డీఎస్సీ నిర్వహించింది. అయితే స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు నిబంధనలు రకరకాలుగా మార్చి … కొన్ని చోట్ల అక్రమ రిక్రూట్ మెంట్ కు అవకాశం ఇచ్చిందనే ఆరోపణలు వైసీపీ మొదలెట్టింది. అసలు నువ్వు డీఎస్సీయే పెట్టలేదుగా అన్నా సరే.. జగన్ పట్టువదలని విక్రమార్కుడిలా వదలకుండా రకరకాల రూపాల్లో, రకరకాల తేదీల్లో పార్టీ నేతలతోనే ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే డ్యామేజ్ అయ్యేది లోకేష్ కే… రేపు తనకు ప్రత్యర్ధిగా లోకేష్ ఉంటాడు.. అందుకే జగన్ అదే పనిలో పడ్డారు. ఇక్కడ వైసీపీ తన పాత్ర సక్రమంగా నిర్వహించలేదనే చెప్పాలి. కర్నూలు జిల్లాలో జరిగిన ప్రభాకర్ ఉదంతం అతని బంధువు బయటపెడితేనే తెలిసింది.. వైసీపీ వల్ల కాదు. కాని దానిని ఆసరాగా చేసుకుని ఆందోళన తీవ్రతరం చేసింది. కర్నూలు ఎపిసోడ్ తో లోకేష్ డిఫెన్సులో పడింది వాస్తవం. అధికారులు ప్రెస్ మీట్లు పెట్టి ఎన్ని వివరణలు ఇచ్చినా.. డ్యామేజ్ జరిగినట్లే కనపడుతోంది.
అందుకే జగన్ రాష్ట్రం మొత్తం ప్రాంతాల నుంచి నేతలను, కార్యకర్తలను తరలించి శాప్ దగ్గర ఆందోళన నిర్వహించారు. దీనికి పోటీగా టీచర్ల నిరసన అంటూ టీడీపీ కౌంటర్ ఆందోళన నిర్వహించింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో టీచర్ల పేరుతో నిరసనలు జరిగాయి. కాని ఇటు వైసీపీ కొనసాగించడం ఏమో గాని.. టీచర్లను ఇలా రోడ్డెక్కించడం మాత్రం ఓవర్ అయిపోయిందనే చెప్పాలి. టీడీపీ రాజకీయంగా ఎదుర్కోవాలి గాని… ఇలా టీచర్లను రోడ్డెక్కించడం ఏంటనే కామెంట్లు గట్టిగానే వస్తున్నాయి. స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందో లేదో తేల్చాలి.. కాని డీఎస్సీని మొత్తంగా తప్పుపట్టకూడదు.. 16 వేల ఉద్యోగాలిచ్చినందుకు అభినందించాల్సిందే అనే కామెంట్లూ వస్తున్నాయి.
