ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న జల రవాణా సంబంధాలు మరోసారి ఇప్పుడు అత్యున్నత స్థాయి చర్చలకు వేదికగా మారుతున్నాయి. దీనిలో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఈ ప్రత్యేక పర్యటనలో భాగంగా ఈరోజు విజయవాడకు రాబోతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఆంధ్రప్రదేశ్‌కు రావడం ఇదే మొదటిసారి కావడంతో ఈ పర్యటన రెండు రాష్ట్రాల పొలిటికల్ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ప్రధానంగా తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా తమిళనాడుకు చెన్నై తాగునీటి అవసరాల కోసం రిలీజ్ చేయాల్సిన కృష్ణా జలాల వాటా, ప్రస్తుతం నీటి సరఫరాలో ఎదురవుతున్న టెక్నికల్ సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడితో విజయ్ సుదీర్ఘంగా చర్చించబోతున్నారు.
దీంతో పాటు గోదావరి,కృష్ణా, కావేరి నదుల అనుసంధానం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జలాశయాల నిర్మాణాలపై ఇద్దరు నేతలు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ భేటీ సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వీరితో కలిసే అవకాశముందని తెలుస్తోంది.
షెడ్యూల్ ప్రకారం సీఎం విజయ్ మధ్యాహ్నం 3:30 గంటలకు విజయవాడ చేరుకుని అక్కడ నుంచి డైరెక్టుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్తారు. వీరిద్దరి మధ్య చర్చలు ముగిసిన తర్వాత.. ఇద్దరు నేతలు ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు. అక్కడ బెజవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
అమ్మ దర్శనం తర్వాత బెజవాడలో అత్యంత వైభవంగా జరుగుతున్న విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకల్లో చంద్రబాబుతో పాటు విజయ్ పాల్గొంటారు. పున్నమి ఘాట్‌లో ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు, జానపద నృత్యాలు, లైవ్ మ్యూజిక్ ఈవెంట్లను కలిసి వీక్షిస్తారు. ఈ పర్యటన పూర్తయిన తర్వాత సీఎం విజయ్ సాయంత్రం తిరిగి చెన్నైకి బయలుదేరి వెళ్లనున్నారు.
