ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి, పుత్తూరు మున్సిపాలిటీలలో వైసీపీ అభ్యర్థులు చాలా చోట్ల విజయం సాధించి తమ సత్తాను చాటారు. నగరి మున్సిపాలిటీ పరిధిలోని 3, 15, 18, 23, 26, 28, 38 వార్డులను వైసీపీ అకౌంట్లో వేసుకోగా.. పుత్తూరు మున్సిపాలిటీలో 4, 27, 29, 36 వార్డుల్లో ఆ పార్టీ కేండిడేట్స్ ఘనవిజయాన్ని సాధించి జయకేతనం ఎగురవేశారు.
పురపోరులో గెలుపొందిన కౌన్సిలర్ కేండిడేట్స్ అంతా.. మాజీ మంత్రి, నగరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ రోజా నివాసంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రోజా విజేతలకు శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా అభినందించారు. తర్వాత విలేకరులతో మాట్లాడిన రోజా, కూటమి ప్రభుత్వంపై విమర్శల వర్షాన్ని కురిపించారు.
ఎన్నికల నామినేషన్ల ప్రాసెస్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా కూటమి నేతలు రౌడీయిజం, గూండాయిజంతో వైసీపీ కేండిడేట్స్ భయభ్రాంతులకు గురి చేశారని రోజా ఆరోపించారు. మూడు అధికార పక్షాలు ఒక్కటై కుట్రలు పన్నినా కూడా ప్రజల మద్దతుతో వైసీపీ భారీ మెజార్టీలతో గెలవడం సంతోషదాయకమని అన్నారు.
ప్రస్తుతం ఏపీలో ప్రజాస్వామ్యం కాకుండా రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డ రోజా.. పోలీసులు, అధికారులను అడ్డుపెట్టుకుని కూటమి నాయకులు ఈ ఎన్నికల్లో విజయాన్ని సాధించారని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా, ఎంతమందిని వేధించినా గ్రౌండ్ లెవల్లో తమ ఓటు బ్యాంకు అంగుళం కూడా చెక్కుచెదరలేదని ఈ రిజల్ట్స్ నిరూపించాయని అన్నారు. 2029లో రాబోయే ఎన్నికల్లో ఇటువంటి రౌడీ రాజకీయాలకు ప్రజలు తమ ఓటుతోనే తగిన రీతిలో జవాబు చెప్పి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమని రోజా అన్నారు.
