వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా అయిన కడపలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రొద్దుటూరు, బద్వేల్, జమ్మలమడుగు, రాయచోటి, రాజంపేట, కమలాపురం మున్సిపల్ పీఠాలను తెలుగు దేశం పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకోగా, ఎర్రగుంట్ల మున్సిపాలిటీని బీజేపీకి కేటాయించింది.
దీంతో కడప మున్సిపల్ ఎన్నికల సమయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. జిల్లాలోని మెజారిటీ మున్సిపాలిటీలు కూటమి అకౌంట్లోకి ఏకగ్రీవంగా చేరడంపై వైసీపీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
ఈ ఏకగ్రీవాల వెనుక ప్రజామోదం ఏమీ లేదని, కేవలం అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు మాత్రమే ఉన్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి నేతలు భయాందోళనలు సృష్టించి తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, చాలా చోట్ల అధికారులపై ఒత్తిడి తెచ్చి నామినేషన్ పత్రాలను అక్రమంగా తిరస్కరింపజేశారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
కేవలం బెదిరింపులు, భౌతిక దాడులతో తమను ఎన్నికల రౌండ్ నుంచి తప్పించలేరని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలను తిరస్కరిస్తున్న కూటమి నేతలు మాత్రం.. గతంలో పాలించిన వైసీపీ వైఖరిపై విసిగిపోయిన ప్రజలే స్వచ్ఛందంగా తమకు మద్దతు తెలుపుతున్నారని కౌంటర్ ఇస్తున్నారు.
మరోవైపు పులివెందుల సహా జిల్లాలోని అన్ని ప్రధాన కేంద్రాల్లో కూడా వైసీపీ తన పట్టు కోల్పోతోందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా ఈ మున్సిపల్ ఫలితాలు రాబోయే రోజుల్లో ఉమ్మడి కడప జిల్లా పొలిటికల్ సమీకరణాలను పూర్తిగా మార్చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
