ఏపీలో కూటమి ప్రభుత్వం పవర్‌లోకి వచ్చాక టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పని చేస్తున్నాయి. పైస్థాయిలో మూడు పార్టీల నేతలు ఐక్యతను ప్రదర్శిస్తున్నా కూడా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయనే చర్చ ఎప్పటినుంచో వినిపిస్తోంది.
ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జనసేన నేతలు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న పరిణామాలు పార్టీలో అసంతృప్తికి కారణమవుతున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మిత్రపక్షంగా ఉన్నా కూడా టీడీపీ నుంచి తగిన గౌరవం దక్కడం లేదని జనసేన శ్రేణులు భావిస్తున్నాయనే అభిప్రాయాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి.
గతంలో పోరాడిన పార్టీకి ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు?
వైసీపీ అధికారంలో ఉన్న టైమ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు చాలా ప్రాంతాల్లో పోటీకి దిగారు. అప్పట్లో ఎదురైన పొలిటికల్ ఒత్తిళ్లను తట్టుకుని మరీ తమ పార్టీ అభ్యర్థుల తరఫున పోరాడారని జనసేన నాయకత్వం చాలా సార్లు చెప్పింది. ఆ సమయంలో పార్టీ సాధించిన విజయాలను పవన్ కళ్యాణ్ కూడా బహిరంగంగా ప్రస్తావించారు. అయితే ఇప్పుడు అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్నా కూడా, తమకు ఆశించిన స్థాయిలో రాజకీయ ప్రాధాన్యం లభించడం లేదనే అసంతృప్తి కొంతమంది జనసేన నేతల్లో కనిపిస్తోందనే చర్చ సాగుతోంది.
లోకల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల టీడీపీ, జనసేన మధ్య కేండిడేట్స్ సెలక్షన్, పదవుల పంపకం విషయంలో విభేదాలు బయటపడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో జనసేన కేండిడేట్స్‌కు నామినేషన్లు వేసే విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయని ఆ పార్టీకి చెంది చాలామంది నేతలు వాపోయారు. దీంతో కూటమిలో కొనసాగుతూ టీడీపీకి సపోర్టుగా పని చేయడం వల్ల తమ పార్టీకి ఏం ప్రయోజనం దక్కుతోందనే ప్రశ్నలు కార్యకర్తల్లో వినిపిస్తున్నట్లు తెలుస్తోంది.
మున్సిపల్ పదవుల విషయంలోనూ వివాదాలు
అలాగే నర్సీపట్నంలో అద్దేపల్లి సౌజన్యను వైస్ చైర్మన్ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఎంపిక చేసినా కూడా.. స్థానిక టీడీపీ నేతల నుంచి ఆమెకు మద్దతు విషయంలో అభ్యంతరాలు ఎదురయినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిణామాలు జనసేనకు క్షేత్రస్థాయిలో ఇబ్బందికరంగా మారుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లాలోని సురభి పంచాయతీ సర్పంచ్ కేండిడేట్ నామినేషన్ వ్యవహారంలో జనసేన కార్యకర్త వీరాంజనేయులు మృతి చెందిన ఘటన కూడా పొలిటికల్‌గా చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో పాటు ఇతర ప్రాంతాల్లో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ జనసేన శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
కూటమిలో భాగస్వామిగా ఉన్నా కొన్ని సందర్భాల్లో తమకు న్యాయం జరగడం లేదని, పోలీసుల వ్యవహారశైలిపైనా అసంతృప్తి ఉందని జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో లోకల్ బాడీ ఎలక్షన్ సమయంలో ఎదురవుతున్న సమస్యలపై పార్టీ నాయకత్వం దృష్టి పెట్టాలని కార్యకర్తలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
పవన్ మౌనం పార్టీకి ఇబ్బందిగా మారుతోందా?
ఈ మొత్తం వ్యవహారంలో జనసేన అధినేత పవన్ స్పందన ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఫిర్యాదులు వస్తున్నా కూడా వాటిపై బలంగా స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీని కోసం పవన్‌తో పాటు పార్టీకి చెందిన కొందరు ముఖ్య నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తే సరిపోతుందనే ధోరణి టీడీపీ నాయకుల్లో ఉందని జనసేన వర్గాలు భావిస్తున్నాయనే విశ్లేషణ కూడా ఉంది.
అయితే పాలిటిక్స్‌లో పొత్తులు కేవలం నాయకుల మధ్య అవగాహనతోనే నిలబడవు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య కూడా పరస్పర గౌరవం, కో ఆపరేషన్ ఉండాలి. ఒక పార్టీ కార్యకర్తలు మరో పార్టీకి చెందిన వారిని ప్రత్యర్థులుగా చూసే పరిస్థితే కనుక ఏర్పడితే, దాని ఎఫెక్ట్ భవిష్యత్తు ఎన్నికలపై పడే అవకాశం ఉంటుంది.
రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన మధ్య ఓట్ల బదిలీ ఈజీగా జరగాలంటే ఇలాంటి విభేదాలకు ఇప్పుడే పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. పవన్ తన పార్టీ శ్రేణుల ఆవేదనను ఎంతవరకు పట్టించుకుంటారు? కూటమిలో జనసేనకు తగిన గౌరవం, పొలిటికల్ ప్రాధాన్యం కల్పించేలా చర్యలు తీసుకుంటారా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.
