తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి అక్టోబర్ 12న శ్రీకారం చుట్టారు. త్రిదండి చిన్నజీయర్ స్వామి వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని ఆలయ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఖమ్మం అర్బన్ మండలం దరుసులాపురం రెవెన్యూ గ్రామ పరిధిలో ఆలయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 20.04 సెంట్ల భూమిని కేటాయించింది. ప్రహరీ గోడ నిర్మాణానికి టీటీడీ రూ.3.40 కోట్లు మంజూరు చేసింది.
ఈ ఆలయ సముదాయంలో ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు, రాజగోపురం, వంటశాల, ప్రాకారం నిర్మించనున్నారు. ఆలయం పూర్తయితే ఖమ్మం ప్రాంత భక్తులకు శ్రీవారి దర్శనం మరింత చేరువ కానుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, సనాతన ధర్మ ప్రచారానికి ఈ ఆలయం కేంద్రంగా నిలవాలని కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు ఆకాంక్షించారు.
