తమిళ చిత్రసీమ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే తారల లిస్ట్‌లోకి మరో స్టార్ హీరో చేరబోతున్నారనే వార్తలు కొన్నాళ్లుగా కోలీవుడ్‌ను కుదిపేస్తున్నాయి.ఇలా వర్సటైల్ యాక్టర్ ధనుష్ రాజకీయ అరంగేట్రంపై రోజుకో వార్త వైరల్ అవుతుండగా, రీసెంట్గా ఆయన అభిమానుల సంఘం పేరు మార్చడంతో ఆ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. అయితే, తాజాగా మహిళా ఫ్యాన్స్‌కు ఆయన అందించిన దీపావళి బహుమతుల వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో..ఇప్పుడు సరికొత్త దుమారాన్ని రేపుతోంది.
ఆదివారం చెన్నైలో ధనుష్ తన అభిమాన సంఘం అయిన నర్బణి ఇయక్కం మహిళా విభాగం సభ్యులతో ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సుమారు 3,000 మందికి పైగా మహిళా ఫ్యాన్స్ హాజరయ్యారు. వారందరితో సరదాగా ముచ్చటించి, గ్రూప్ ఫొటోలు దిగిన ధనుష్.. దీపావళి కానుకగా వారందరికీ స్పెషల్‌గా తయారు చేయించిన వెండి గిన్నెలను బహుమతులుగా అందచేశారు.
అయితే, ఆ వెండి బహుమతులపై బీజేపీ అధికారిక గుర్తు అయిన ‘కమలం’ ముద్రించి ఉండటమే ఇప్పుడు ఆశ్చర్యపరుస్తోంది. దీనికి సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే బాగా వైరల్ కావడంతో, ధనుష్ త్వరలోనే బీజేపీతో జట్టు కట్టబోతున్నారనే చర్చ పొలిటికల్ వర్గాల్లో వేగంగా ఊపందుకుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు కొన్ని తమిళ రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అంశంపై భిన్నమైన వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత ముదిరినట్లు అయింది.
ఈ పరిణామంపై ధనుష్ అభిమాన సంఘం ‘నర్బణి ఇయక్కం’ ప్రతినిధులు వెంటనే స్పందించి వివాదానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. వెండి బహుమతులపై ఉన్న కమలం గుర్తుకు, ఏ రాజకీయ పార్టీకి కూడా ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. అది కేవలం ఆ వెండి వస్తువులను తయారు చేసిన జ్యువెలరీ మాన్యుఫ్యాక్చరర్ ముద్రించిన కంపెనీ లోగో మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. తమ హీరో ఇమేజ్ను, దీపావళి కానుకల వ్యవహారాన్ని అనవసరంగా రాజకీయం చేయొద్దని వారు కోరారు.
https://x.com/Dnarpaniiyakkam/status/2114379776668606646/video/1
