ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రాసెస్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకున్న సమయంలో.. పల్నాడు జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. చిలకలూరిపేట పురపాలిక మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నికలో వైఎస్ఆర్సీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ తరఫున ఛైర్పర్సన్ అభ్యర్థిగా రేసులో ఉన్న కారెమూన్ షేక్.. అనూహ్యంగా టీడీపీ కండువా కప్పుకోవడం స్థానికంగా చర్చనీయాంశం అయింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 25 వతేదీ ఆదివారం సాయంత్రమే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఫైనల్ లిస్ట్‌ను అఫీషియల్‌గా విడుదల చేసింది. అయితే ఆ లిస్ట్ వచ్చిన కొద్ది గంటల వ్యవధిలోనే కారెమూన్ షేక్ తన భర్త యూసుఫ్ అలీతో కలిసి.. పసుపు కండువా కప్పుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో దంపతులిద్దరూ కూడా కూటమిలో చేరారు.
చిలకలూరిపేట మున్సిపల్ ఛైర్పర్సన్ స్థానానికి జనసేన తరఫున తోట రాజరాజేశ్వరి బరిలో నిలబడగా.. వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడ్డ కారెమూన్ షేక్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అయితే నామినేషన్ల ఖరారు పూర్తి కాగానే వైఎస్ఆర్సీపీ కేండిడేట్ పోటీ నుంచి తప్పుకుని సైకిల్ ఎక్కడంతో ఇక్కడ ఎన్నికల ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోయాయి.
ఈ సందర్భంగా మాట్లాడిన కారెమూన్ షేక్ .. సీఎం చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని కూటమి గవర్నమెంట్, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నియోజకవర్గంలో అందిస్తున్న సంక్షేమం, వేగవంతమైన అభివృద్ధి నచ్చడం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇకపై తాను పోటీలో ఉండబోనని, కూటమి అధికారిక అభ్యర్థి తోట రాజరాజేశ్వరి విజయానికి తాను ప్రచారం నిర్వహిస్తానని చెప్పారు. ఈ చేరికల కార్యక్రమంలో జనసేన అభ్యర్థి తోట రాజరాజేశ్వరి అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్‌తో పాటు కొంతమంది కూటమి నాయకులు పాల్గొని వారికి ఆహ్వానం పలికారు.
