పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తుపాను అక్వాన్ తీరం వైపు అత్యంత వేగంగా దూసుకొస్తోంది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 13 కి.మీ. వేగంతో ఉత్తర దిశగా కదులుతున్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రస్తుతం ఇది కళింగపట్నంకు 320 కి.మీ, నరసాపురంకు 390 కి.మీ, గోపాల్‌పూర్‌కు 410 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ప్రారంభంలో నెల్లూరు, తుని మధ్య తీరం దాటుతుందని అంచనా వేసినా కూడా, వాతావరణంలో సంభవించిన మార్పుల వల్ల తన దిశను మార్చుకుంది. రేపు మధ్యాహ్నానికి ఇది ఒడిశాలోని గోపాల్పూర్ సమీపంలో తీరాన్ని దాటే ఛాన్స్ ఉందని అధికారులు స్పష్టం చేశారు.
తుపాను తీరం దాటే క్లిష్ట సమయంలో గంటకు 90 – 100 కి.మీ, గరిష్ఠంగా 110 కి.మీ. వేగంతో వీచగల బలమైన ఈదురుగాలులు విరుచుకుపడతాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
తుపాను ఒడిశా వైపు పయనిస్తున్నా కూడా, ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలపై దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉండబోతోంది. ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండగా, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ జిల్లాలలో మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీ గవర్నమెంట్ ముందస్తు రక్షణ చర్యలు చేపట్టింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని అన్ని విద్యాసంస్థలతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు కూడా అధికారులు సెలవులను ప్రకటించారు. ఆంధ్రా ఒడిశా సరిహద్దు తీరప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రానున్న 2 రోజులు సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారనుండటంతో మత్స్యకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. అంతేకాకుండా పొలాల్లో ఉన్న పంటలు దెబ్బతినకుండా రైతులు ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని APSDMA యంత్రాంగం హెచ్చరించింది.
