దేశ రాజకీయాల్లో మరోసారి నియోజకవర్గాల పునర్విభజన అంశం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యంపై ప్రభావం చూపిస్తుందనే ఆందోళనలతో ఇప్పటివరకు డీలిమిటేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన డీఎంకే.. ఇప్పుడు అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం నవంబర్ 30వ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించింది. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని పార్టీ వైఖరిలో వచ్చిన మార్పు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అన్ని రాష్ట్రాల్లోనూ లోక్‌సభ స్థానాలను ప్రస్తుత సంఖ్యతో పోలిస్తే 50 శాతం పెంచే ప్రతిపాదన ఉండటమే తమ నిర్ణయానికి కారణమని డీఎంకే ఎంపీ ఏ. రాజా వెల్లడించారు. నియోజకవర్గాల పునర్విభజన న్యాయబద్ధంగా జరగాలన్నదే తమ పార్టీ మొదటి నుంచీ కోరుకుంటున్న విధానమని ఆయన స్పష్టం చేశారు.
శనివారం పార్టీ అధినేత స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఎంపీల సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. అనంతరం బిల్లుకు మద్దతు తెలుపుతూ నిర్ణయాన్ని తీసుకున్నారు. అన్ని రాష్ట్రాలకూ ఒకే విధంగా సీట్ల పెంపు వర్తిస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదన్న అభిప్రాయంతో డీఎంకే ముందుకు వెళ్లినట్లు తెలుస్తోంది.
డీఎంకే తాజా నిర్ణయం వెనుక ఆసక్తికరమైన రాజకీయ నేపథ్యం ఉంది. గతంలో నియోజకవర్గాల పునర్విభజన విషయంలో స్టాలిన్ పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ముఖ్యంగా జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల కేటాయింపులో నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది.
2025లో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. 2026 తర్వాత మరో 25 ఏళ్ల పాటు లోక్‌సభ స్థానాల సంఖ్యపై ఉన్న స్తంభన కొనసాగించాలని డిమాండ్ చేసింది. అంతేకాదు, 2026 ఏప్రిల్‌లో లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ డీఎంకే ఎంపీ కనిమొళి కూడా గళమెత్తారు. లోక్‌సభ స్థానాల సంఖ్య 816కు చేరితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం, రాజకీయ ప్రభావం తగ్గే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం సీట్లు పెంచాలనే ప్రతిపాదన రావడంతో డీఎంకే తన వైఖరిని మార్చుకుంది. అయితే ఈ నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు వాస్తవంగా ఎంత ప్రయోజనం కలుగుతుంది? జనాభా ప్రాతిపదికన భవిష్యత్తులో సీట్ల పంపకం ఎలా ఉంటుంది? అనే అంశాలు ఇంకా కీలకంగానే ఉన్నాయి.
మొత్తానికి డీలిమిటేషన్‌పై డీఎంకే తీసుకున్న తాజా నిర్ణయం జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఒకప్పుడు బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీ ఇప్పుడు మద్దతు ప్రకటించడం వెనుక ఉన్న రాజకీయ లెక్కలు ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఇతర దక్షిణాది పార్టీలు ఎలా స్పందిస్తాయన్నది కూడా చూడాలి.
