తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీలో మిత్రపక్షాలైన జనసేన, టీడీపీ మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పక్కన పెట్టి, వైసీపీ సభ్యుల సాయంతో వైస్ ఛైర్మన్ పదవిని జనసేన దక్కించుకోవడం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. నవంబర్ 24వ తేదీ సోమవారం జరిగిన ఎన్నికల్లో జనసేన కౌన్సిలర్ కళ్యాణ చక్రవర్తి, టీడీపీ అభ్యర్థి కొమ్మిన వెంకటేశ్వరరావుపై గెలుపొందారు.
ఈ పరిణామాలకు ముందు జనసేనకు చెందిన మున్సిపల్ ఛైర్పర్సన్ మురాల జ్యోతితో పాటు 32 మంది వార్డు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత నిర్వహించిన వైస్ ఛైర్మన్ ఎన్నికల్లో నాలుగో వార్డు కౌన్సిలర్ కళ్యాణ చక్రవర్తికి 18 ఓట్లు దక్కగా, టీడీపీ అభ్యర్థికి 13 ఓట్లు మాత్రమే వచ్చాయి. కళ్యాణ చక్రవర్తి విజయంలో జనసేన పార్టీకి చెందిన 15 మందితో పాటు బీజేపీకి చెందిన ఒకరు, వైసీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు మద్దతు ఇవ్వడం గమనార్హం.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 32 వార్డుల ఫలితాలను చూస్తే జనసేన 14, టీడీపీ 13, వైసీపీ 3, బీజేపీ 1 చోట గెలవగా, ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ విజయం సాధించారు. ముందస్తు అంగీకారంతో ఛైర్మన్ సీటు జనసేనకు, వైస్ ఛైర్మన్ పదవి టీడీపీకి ఇవ్వాల్సి ఉంది. అయితే ఎన్నికల సమయంలో సమీకరణలు మారడంతో ఈ వివాదం మొదలైంది.
ఈ వ్యవహారంపై టీడీపీ నాయకులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కందుల దుర్గేశ్ హామీ ఇచ్చినా కూడా జనసేన నేతలు మాట తప్పారని టీడీపీ సీనియర్ నేత, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు ఆరోపించారు. ఒప్పందాన్ని అమలు చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటూ ఆయన హెచ్చరించారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు.
మరోవైపు స్వయంగా మంత్రి దుర్గేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితి రావడంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దీనిపై మంత్రిని వివరణ కోరగా, స్థానిక నేతలతో మాట్లాడి అధిష్ఠానం నిర్ణయాన్ని అమలు చేస్తానని మంత్రి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నిక ఫలితం వచ్చిన వెంటనే టీడీపీకి చెందిన 13 మంది కౌన్సిలర్లు సభ నుంచి వాకౌట్ చేశారు.
