ఇండియన్ సినీ హిస్టరీలో రామాయణ: పార్ట్ 1 ఒక రికార్డు వేటతో దూసుకుపోతోంది. మూవీ రిలీజైన 19వ రోజుకే ప్రపంచవ్యాప్తంగా రూ.1,700 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో చూపిస్తోంది. రణ్‌బీర్ కపూర్, యశ్‌ల అద్భుత పెర్ఫార్మెన్స్ ఆడియన్స్‌కు మంచి కిక్ ఇస్తోంది. మూడో వారాంతంలో థియేటర్ల వద్ద మంచి జోరు చూపినా, మూడో సోమవారం కావడంతో కలెక్షన్లలో కొంత స్లోడౌన్ కనిపించింది.
ట్రేడ్ లెక్కల ప్రకారం విడుదలైన 19వ రోజున అన్ని లాంగ్వేజ్‌లో కలిపి రూ.12.70 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి. నవంబర్ 22వ తేదీ ఆదివారం రూ.35.60 కోట్లు రాబట్టగా, నవంబర్ 22 వ తేదీ సోమవారానికి 64.3 శాతం డ్రాప్ నమోదైంది. అయినా సరే, ఇండియాలో ఇప్పటివరకు రూ.955.45 కోట్ల నెట్ కలెక్షన్లతో వెయ్యి కోట్ల క్లబ్‌కు కేవలం రూ.44.55 కోట్ల దూరంలోనే నిలిచింది.
భారత్ గ్రాస్ రూ.1,141.65 కోట్లు కాగా, ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఏకంగా రూ.563 కోట్లు వచ్చాయి. దీంతో వరల్డ్‌వైడ్ గ్రాస్ కలెక్షన్ రూ.1,704.65 కోట్లకు చేరింది. 19వ రోజు భాషల వారీగా చూస్తే హిందీలో రూ.9.25 కోట్లు, మలయాళంలో రూ.1.50 కోట్లు, కన్నడలో రూ.85 లక్షలు, తమిళంలో రూ.80 లక్షలు, తెలుగులో రూ.30 లక్షల నెట్ వసూళ్లు నమోదయ్యాయి.
నితేష్ తివారీ డైరెక్షన్లో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ ఇతిహాస చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యశ్ రావణుడిగా నటించారు. వీరితో పాటు రవి దూబే లక్ష్మణుడిగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా, లారా దత్తా కైకేయిగా, అరుణ్ గోవిల్ దశరథుడిగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా కీలక పాత్రలను పోషించారు.
నమిత్ మల్హోత్రా, యశ్ కలిసి నిర్మించిన ఈ సినిమాకు ఆస్కార్ విజేతలు హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, డీనెగ్, రీడిఫైన్ సంస్థల విజువల్ ఎఫెక్ట్స్ ఈ మూవీని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇక ఈ సిరీస్‌లో వచ్చే రామాయణ: పార్ట్ 2 చిత్రాన్ని 2028 దీపావళికి రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో, సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
