వైఎస్సార్ ఫ్యామిలీలో ఆస్తుల చర్చలు ముమ్మరంగా సాగుతున్న సమయంలో, ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు బెంగళూరు కోర్టులో ఊహించని న్యాయపరమైన చిక్కు ఎదురైంది. బెంగళూరు నార్త్ తాలూకా, జాలా హోబ్లీ పరిధిలోని కట్టిగేనహళ్లి ఊరిలో ఉన్న ఒక ఆస్తికి సంబంధించి దేవనహళ్లి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు..నవంబర్ 21వ తేదీ శనివారం కీలక ఆదేశాలను జారీ చేసింది. సదరు వివాదాస్పద ప్రదేశంలోకి షర్మిల కానీ, ఆమె కుటుంబ సభ్యులు లేదా షర్మిల తరఫున ప్రతినిధులు కానీ ఎవరూ ప్రవేశించకుండా మధ్యంతర ఇంజక్షన్ ఉత్తర్వులను వెలువరించింది.
సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ సివిల్ దావాను కోర్టులో పిటిషన్‌గా దాఖలు చేసింది. సదరు భూమిని తాము 2007 మార్చి 1 నుంచి 2027 ఫిబ్రవరి 28 వరకు అంటే 20 సంవత్సరాల కాలానికి లీజుకు తీసుకున్నామని, దీని ప్రకారం తాము రెగ్యులర్‌గా అద్దె చెల్లిస్తూ పవర్ బిల్లులు కూడా కడుతున్నామని న్యాయస్థానానికి తెలిపింది.
గతంలో టెంపరరీ పర్మిషన్తో అక్కడ ఉన్న వైఎస్ షర్మిల, ఇప్పుడు ఇతర వ్యక్తుల ద్వారా ఆ స్థలాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పిటిషనర్లు ఆరోపించారు. లీజు పత్రాలు, రెంట్ రిసీప్ట్‌లను పరిశీలించిన కోర్టు, పిటిషనర్లకు నష్టం వాటిల్లకుండా ఉండటానికి ఈ టెంపరరీ ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తున్నట్లు తెలిపింది.
న్యాయస్థానం ఆదేశాల ప్రకారం.. వైఎస్ షర్మిల ఇకపై ఆ స్థలంలోకి వెళ్లడం, పనులను అడ్డుకోవడం, అక్కడ ఉన్న చెట్లు, కంచె లేదా గోడలను ధ్వంసం చేయడం వంటి ఎలాంటి చర్యలకు కూడా పాల్పడకూడదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై తర్వాత విచారణను డిసెంబర్ 19వ తేదీకి వాయిదా వేస్తూ షర్మిలకు నోటీసులను జారీ చేసింది.
షర్మిల కుమార్తె వివాహ వేడుకల పనుల సందర్భంగా చోటుచేసుకున్న ఈ పరిణామం పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది యజమాని హక్కులపై ఇచ్చిన తుది తీర్పు కాదని, కేవలం టెంపరరీ ఎంట్రీని అడ్డుకునే సివిల్ ఉత్తర్వు మాత్రమేనని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరి తర్వాత విచారణలో షర్మిల తన తరఫు వాదనలు వినిపించాల్సి ఉంది.
