ఏపీలో అధికార కూటమిలో అంతా సవ్యంగానే ఉందని అనుకుంటున్న టైమ్‌లో కడప జిల్లా పాలిటిక్స్‌కు కొత్త చర్చకు తెరలేపాయి. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి విషయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆశించిన నిర్ణయం రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైనట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తన ఫ్యామిలీకి చెందిన వ్యక్తికి ఆ పదవి దక్కుతుందని భావించగా.. చివరి నిమిషంలో నిరాశ ఎదురైందనే న్యూస్ పొలిటికల్ వర్గాల్లో ఆసక్తిని పెంచుతుంది. ఈ పరిణామం ఇప్పుడు కూటమిలోని పార్టీల మధ్య సమన్వయంపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది.
కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని టీడీపీ తన అకౌంట్లో వేసుకుంది. ఈ పదవికి వీఎన్ పల్లి జెడ్పీటీసీ సభ్యుడు పుత్తా నరసింహారెడ్డిని కేండిడేట్‌గా ఎంపిక చేసింది. అయితే ఆదినారాయణరెడ్డి తన సోదరుడి కుమారుడు, జమ్మలమడుగు జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైన డాక్టర్ రాజేష్‌రెడ్డిని చైర్మన్ చేయాలని గట్టిగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
రాజేష్‌రెడ్డి జెడ్పీటీసీగా ఏకగ్రీవం కావడం వెనుకున్న రీజన్ కూడా జెడ్పీ చైర్మన్ పదవిపై ఉన్న ఆశలు కారణమని పొలిటికల్ వర్గాల్లో చర్చ సాగుతోంది. చివరకు టీడీపీ అధినాయకత్వం వేరే కేండిడేట్‌ను సెలక్ట్ చేయడంతో ఆదినారాయణరెడ్డి వర్గం నిరాశకు గురైనట్లు తెలుస్తోంది.
కడప జిల్లాలో లోకల్ బాడీ ఎలక్షన్స్ సమయంలో ఆదినారాయణరెడ్డి కీలకంగా వ్యవహరించారని రాజకీయ వర్గాల్లో గట్టిగానే పేరు ఉంది. ముఖ్యంగా పులివెందుల మున్సిపాలిటీ, పరిషత్ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అనుకూలంగా ఏకగ్రీవాలు సాధించడంలో ఆయన రోల్ ఉందని చాలా కథనాలు చెబుతున్నాయి. దీంతో టీడీపీ కోసం తాము చేసిన ప్రయత్నాలను గుర్తించి జెడ్పీ చైర్మన్ పదవిని తమ ఫ్యామిలీకి కేటాయిస్తారని ఆయన ఆశించినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే రాజకీయాల్లో ఒక పార్టీకి సహకరించడం, ఎన్నికల్లో కీలకంగా పనిచేయడం వేరు.. పదవుల కేటాయింపు విషయంలో ఫైనల్ డెసిషన్ తీసుకోవడం వేరు. కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య సీట్లు, పదవుల పంపకం అనేక ఈక్వేషన్స్పైన ఆధారపడి ఉంటుంది. ఈసారి కడప జెడ్పీ చైర్మన్ ఎంపికలో హైకమాండ్ తీసుకున్న నిర్ణయం ఆదినారాయణరెడ్డి అంచనాలకు డిఫరెంట్‌గా ఉండటమే అసంతృప్తికి కారణంగా కనిపిస్తోంది.
దీంతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కకపోవడంతో ఆదినారాయణరెడ్డి పార్టీకి రిజైన్ చేయబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఆయనతో పాటు జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో గెలిచిన ముగ్గురు బీజేపీ జెడ్పీటీసీ సభ్యులు కూడా రిజైన్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, ముద్దనూరు ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులు జెడ్పీటీసీలుగా గెలుపొందడం ఈ చర్చకు మరింత ఇంపార్టెన్స్ తీసుకొచ్చింది.
ఈ పరిణామాలతో ఆదినారాయణరెడ్డి విజయవాడకు వెళ్లినట్లు సమాచారం. తన అసంతృప్తిని మీడియా ముందు వెల్లడించడానికి ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే రాజీనామా చేస్తారనే వార్తలు ప్రచారంలో ఉన్నా.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వాటిని ఫైనల్ డెసిషన్‌గా భావించలేం.
