దేశంలోని రైతులు, చిన్న వ్యాపారులకు ఊరట కలిగించేలా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్(Union Cabinet ) బుధవారం చాలా కీలక నిర్ణయాలకు ఆమోదముద్రన వేసింది. ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మొత్తం రూ.77,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కేబినెట్ సమ్మతి తెలిపింది.
పశ్చిమాసియాలో నెలకొన్న రాజకీయ సంక్షోభం వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ భారం దేశీయంగా రైతులపై పడకుండా మోదీ ప్రభుత్వం ముందస్తు చర్యలను చేపట్టింది. ప్రస్తుత రబీ పంటల సాగు కోసం ఎరువుల సబ్సిడీ రూపంలో ఏకంగా రూ.62,370 కోట్లు కేటాయించడానికి ఆమోదాన్ని తెలిపింది. గత 2025-26 రబీ సీజన్‌తో పోలిస్తే ఇది 64 శాతం కేటాయింపు ఎక్కువ కావడం విశేషం.
ఈ సబ్సిడీ 2027 మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని కేంద్ర కేబినెట్ (Union Cabinet ) నిర్ణయించింది. దీనిద్వారా రైతులకు 50 కిలోల డీఏపీ బస్తా కేవలం రూ.1,350కే లభిస్తుంది. అక్టోబర్ నుంచి మార్చి వరకు సాగయ్యే గోధుమలతో పాటు పప్పుధాన్యాలు, నూనెగింజలు రైతులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.
రైతులతో పాటు చిన్న వ్యాపారులను ఆదుకోవడనికి కూడా కేంద్ర కేబినెట్ పెద్దపీట వేసింది. ప్రధాని ముద్రా యోజన పథకం కింద చిన్న వ్యాపారులకు ఈజీగా రుణాలు అందేలా రూ.5,000 కోట్ల రుణ హామీ నిధిని ఆమోదించింది. ఇది సూక్ష్మ, చిన్న తరహా ఇండస్ట్రీలకు, స్వయం ఉపాధి పొందుతున్నవారికి ఆర్థిక బలాన్ని చేకూర్చబోతోంది.
దీంతో పాటు ఇండియన్ హిస్టరీ, భారతీయ విశిష్ట సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పేలా ఢిల్లీలోని చారిత్రక నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ భవనాలను భారీ మ్యూజియంగా మార్చడానికి కేబినెట్ రూ.3,230 కోట్లు కేటాయించింది. దాదాపు 1.79 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించబోయే మ్యూజియంలో 2027 నాటికి తొలి గ్యాలరీ అందుబాటులోకి రాబోతోంది. రోజుకు 30 వేల మంది సందర్శకులు విజిట్ చేసేలా 2027 నుంచి 2031 వరకు దశలవారీగా ఈ పనులను పూర్తి చేయబోతున్నారు.
