రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్న విషయం కొన్ని నెలలుగా వినిపిస్తోంది. సొంతంగా ప్రాంతీయ పార్టీని స్థాపించడానికి వేగంగా సన్నాహాలు చేసుకుంటున్న విజయసాయి..నవంబర్ 11వ తేదీన జరిగే పార్టీ ప్రారంభోత్సవానికి ముందే గ్రౌండ్ వర్క్‌ను వేగవంతం చేశారు. దానిలో భాగంగానే తన రాజకీయ ప్రస్థానాన్ని, భావజాలాన్ని వివరిస్తూ ఒక సన్నాహక గీతాన్ని రిలీజ్ చేయడంతో రాజకీయా వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది.
2024 ఎన్నికల తర్వాత వైసీపీ అధినాయకత్వంతో విభేదాలు రావడం, పార్టీ పదవులకు కూడా స్వస్తి చెప్పడం వంటి పరిణామాలు శరవేగంగా జరిగాయి. తర్వాత జాతీయ పార్టీలలో ఆ తర్వాత స్థానిక పొత్తులలో చేరతారని ప్రచారం జరిగినా కూడా ఆ ఊహాగానాలన్నింటికీ కూడా ఆయన స్వస్తి చెప్పి తాను స్వయంగా ఒక పొలిటికల్ ఫోరమ్ సృష్టిస్తున్నట్లు విజయసాయిరెడ్డి తేల్చిచెప్పేశారు.
కొత్త పార్టీ కోసం డేట్ టైమ్ ఫిక్స్ చేసి మరీ రెడీ అవుతున్నానంటూ విజయసాయి రెడ్డి వివరించారు. ‘11’ నంబర్ సెంటిమెంట్‌తో నవంబర్ 11వ తేదన ఉదయం 11:11 గంటలకు గ్రాండ్‌గా పార్టీ పేరును ఆవిష్కరించడానికి విజయవాడలో భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
పార్టీ పేరును ఇంకా అఫీషియల్‌గా బయటపెట్టకపోయినా, ఈ సన్నాహక సాంగ్ ద్వారా తన తర్వాత రాజకీయ దిశను చెప్పకనే చెప్పారు. ప్రజా సంక్షేమం, యువతకు అవకాశాలు, ఏపీ అభివృద్ధిని ప్రధాన ఎజెండాగా మార్చుకుంటూ సాగిన ఈ గీతం విజయసాయిరెడ్డి అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. సుదీర్ఘ పొలిటికల్ అనుభవం, ఆర్థిక వ్యవస్థపై కావాల్సినంత పట్టున్న విజయసాయిరెడ్డి కొత్తగా ఏర్పాటు చేయబోయే.. ఈ పార్టీ ఏపీలోని ప్రధాన పార్టీల సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.
