తెలుగు రాష్ట్రాల్లో వానల ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. మొన్న అర్నబ్ తుపాన్, తర్వాత మురసు తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా ఏపీ లోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు రైతాంగానికి భారీగా పంట నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితుల నుంచి ఇంకా కోలుకోకముందే, తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) లేటెస్ట్ వెదర్ బులెటిన్‌లో హెచ్చరించింది.
వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. తూర్పు తెలంగాణ, దానికి ఆనుకుని ఉన్న కోస్తాంధ్ర ప్రాంతాలలో కొనసాగిన అల్పపీడనం బలహీనపడినా కూడా, దాని ప్రభావంతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 – 4.5 కి.మీ ఎత్తులో ఇంకా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో గురువారంతో పాటు మరో 2,3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్నిచోట్ల గంటకు 30 – 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేశారు. రాయలసీమలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని తెలిపారు.
ఇక తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు కొన్ని జిల్లాల్లో మరో మూడు రోజుల పాటు వానలు కొనసాగనున్నాయి. అక్కడక్కడా భారీ వర్షాలు పడే ఛాన్స్ కూడా ఉండటంతో.. లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, చెట్ల కింద, హోర్డింగ్స్ కింద నిలబడకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
