పాలిటిక్స్‌లో గెలుపు అనేది కేవలం సంబరం కాదు, అది రాజకీయంలో భాగం మాత్రమే. అలాగే ఓటమి అనేది కూడా ఓ ముగింపు కాదు, పదునైన లెసన్. కానీ, ఎజెండా ఏదైనా కావొచ్చు పోరాటం ఎక్కడైనా కావొచ్చు.. ఓడిపోయిన ప్రతీసారీ అది ప్రత్యర్థుల కుట్రలగానో, అధికార పార్టీ ప్రలోభాల గానో అలాగే వ్యవస్థలోని లోపాలను సాకుగా చూపించకూడదు. ఇంకా చెప్పాలంటే సొంత ఇంట్లో మండుతున్న చిచ్చును పట్టించుకోకపోతే దాన్ని రాజకీయ విశ్లేషణ అని కూడా అనలేం. అది కేవలం కళ్ల ముందు జరుగుతున్న నిజాల నుంచి పారిపోవడమే. ప్రస్తుత వైసీపీ రాజకీయ గమనాన్ని జాగ్రత్తగా గమనిస్తే సరిగ్గా ఇలాంటి అంతర్మథనమే తెర మీదకు వస్తుంది.
పుర ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడం ఆ పార్టీకి ఒక ఎత్తయితే, అసలు ఆ పరాజయానికి మూలాలు ఎక్కడున్నాయో బేరీజు వేసుకోలేకపోవడం మరో పెద్ద వ్యూహాత్మక లోపంగా కనిపిస్తోంది. అవతలివారు బలంగా ఉన్నారని ఒప్పుకోవచ్చు, అధికారంలో ఉన్నవారికి ఎప్పుడూ కూడా అడ్వాంటేజెస్ ఉంటాయని అంగీకరించొచ్చు. కానీ ప్రతి పోరాటంలోనూ ప్రత్యర్థే విలన్ అనుకుంటే, మరి గెలిచినప్పుడు ఆ క్రెడిట్ ఎవరి ఖాతాలో వేస్తారనేదే ఇప్పుడు వైసీపీ అధిష్టానం అద్దంలో చూసుకుని వేసుకోవాల్సిన ప్రశ్న అని విశ్లేషకులు చెబుతున్నారు.
యుద్ధభూమిలో కమాండెంట్ ఆర్డర్స్ ఇవ్వడం వేరు అలాగే క్షేత్రస్థాయిలో ఆ వ్యూహం ఆచరణలోకి రావడం వేరు. కేవలం పోటీ చేయండని ఆదేశాలిచ్చి చేతులు దులిపేసుకుంటే సరిపోదు. బరిలో దిగే కేండిడేట్ ఎవరు? అతడి వెనుకున్న సైన్యం ఎంత? స్థానికంగా అతనికున్న పట్టు ఎంత అనే గ్రౌండ్ రియాలిటీని కూడా బేరీజు వేయాల్సిన బాధ్యత ఎప్పుడూ కూడా హైకమాండ్‌దే. సైన్యాన్ని సరిహద్దుకు పంపి చేతులు దులుపుకొంటే విజయం రాదు.వారికి ఆయుధాలు ఇవ్వాలి, వ్యూహం రచించాలి, సంక్షోభం ఏర్పడితే అండగా నిలవాలి. లేదంటే నాయకులు జగన్‌లా కేవలం రివ్యూలు చేస్తూ ఉండిపోతారు, కార్యకర్తలు ఒంటరిగా నలిగిపోతారు.
నిజానికి అభ్యర్థుల ఎంపిక దగ్గరే అసలు డ్రామా స్టార్టవుతుంది. టికెట్ కేటాయింపు అనేది పోస్టర్లపై పేర్లు ముద్రించే తంతేమీ కాదు. అది పార్టీ భవిష్యత్తును డిసైడ్ చేసే హై-వోల్టేజ్ ప్రాసెస్. స్థానికంగా ప్రజాబలం ఉందా.. వారికి కార్యకర్తల మద్దతు మెండుగా ఉందా? లేక కేవలం పదవుల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారా అనే ఈ తేడాను గమనించడంలో లెక్కలు తప్పితే ఫలితాలు కూడా ఇలాగే రివర్స్ అవుతాయి.
పార్టీలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, అబ్జర్వర్స్ జిల్లా అధ్యక్షులు.. ఇలా హోదాలకు, పదవులకు కొదవ ఉండదు. కానీ అసలు సమస్యల్లా బాధ్యత తీసుకునే నాథుడే కరువవ్వడం అనే పాయింట్‌ను మర్చిపోవడం. ఎలక్షన్స్ ముందు హడావుడి చేసి, ఫలితాలొచ్చాక అడ్రస్ లేకుండా పోయే నాయకులను ఏమనాలి? జగన్‌కు ప్రజల్లో ఉన్న మాస్ ఇమేజ్‌ను, పర్సనల్ ప్రజాదరణను పటిష్టమైన సంస్థాగత శక్తిగా మార్చడంలో ఎప్పుడూ కూడా ఈ ద్వితీయ శ్రేణి నాయకత్వమే ఘోరంగా ఫెయిల్ అవుతోంది.
జగన్‌కు నచ్చే భజన వార్తలు చెప్పడమే విధేయత అని భ్రమపడుతూ.. గ్రౌండ్ జీరోలో ఉన్న కఠిన నిజాలను మాత్రం ఆయన వరకూ చేరవేయడంలో నేతలు పూర్తిగా చాప చుట్టేశారు. అందుకే నవంబర్ 3న రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ లీడర్స్ వల్లే తాము ఓడిపోయామని ఓపెన్‌గా చెప్పిన వైసీపీ అభ్యర్థులు చాలామంది కనిపించారు.
చివరకు చెప్పేదేంటంటే.. రాజకీయాల్లో ప్రత్యర్థులను ఓడించడం ఎంత ఇంపార్టెంటో.. సొంత పార్టీలోని లోపాలను సరిదిద్దుకోవడం అంతకంటే ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవాలి. ఓటమి నుంచి లెసన్ నేర్చుకోని పార్టీలు ఎంత పెద్దవైనా సరే చివరకు చరిత్రలో కరిగిపోతాయి తప్ప మళ్లీ గెలవలేవు. ప్రత్యర్థిని విమర్శించడం ఈజీ, కానీ తమ తప్పులను సరిదిద్దుకోవడమే అసలైన రాజకీయ చతురత. లేదంటే కాలం మారుతుంది, అభ్యర్థులు మారిపోతారు.. కానీ ఫలితాల రాత మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది.
