వంగవీటి కెరటం మళ్లీ ఎగసిపడింది. వంగవీటి రంగా వారసుడు రాధా విజయవాడ మేయర్ గా గెలిచారు. అసలు రాధాను అభ్యర్ధిగా, అది కూడా జనసేన అభ్యర్ధిగా ప్రకటించినప్పుడే గెలుపు ఫిక్స్ అయిపోయింది. తర్వాత సోషల్ మీడియా హడావుడితో ఏబీ వెంకటేశ్వరరావు ఇబ్బంది పెట్టొచ్చనే అంచనాలు వచ్చాయి గాని.. అవన్నీ సోషల్ మీడియాకే పరిమితం అయ్యాయి. పడాల్సిన ఓట్లు రాధాకు ఇంకా ఉన్నాయి. కాని అవి పోలింగ్ రోజు ఓటింగ్ తగ్గినప్పుడే రావని అర్ధమైంది. అందుకు వంగవీటి కులం కారణం కావొచ్చు.. లేదా రాధాపై వారికున్న అభిప్రాయం వల్ల కావొచ్చు.. అందుకే పోలింగ్ శాతం తగ్గింది. కూటమి ఓట్లన్నీ పడుంటే ఈ రోజు మెజారిటీ ఇంకా ఎక్కువ ఉండేది అనడంలో సందేహం లేదు. ఏమైనా ఇది వంగవీటి రాధకు మరో ఛాన్స్.
ఒకప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అంత పేరు రాలేదు. పైగా రంగాతో పోల్చుకుని కాస్త నిరాశపడ్డ విషయం వాస్తవం. కాని తర్వాత చాలా మార్పులు జరిగాయి.. రాధా సైతం చాలా మారారు. పదవుల కోసం ఎప్పుడూ పాకులాడకుండా.. తనకు నచ్చినట్లు ఉండటమే రాధా కెరీర్ వెనకపడటానికి కారణం. ఇతర రాజకీయ నేతల్లా కాకుండా ఎమోషన్స్ మీద పని చేయడం రాధాకు అలవాటు. అందుకే డౌన్ వచ్చినా, అప్ వచ్చినా పెద్దగా చలించినట్లు కనపడరు. ఈ గెలుపు రాధాకు మామూలుగానే అనిపించొచ్చు.. కాని బెజవాడలో రంగా ఆభిమానులకు మాత్రం పండగే. రంగా తర్వాత అంతటి ఊపు తెచ్చిన నేత లేరు. రాధా ఉన్నా తండ్రి విగ్రహాలు ఆవిష్కరించడం తప్ప.. పెద్దగా యాక్టివ్ గా లేకపోవడం.. పైగా అధినేతలతో విబేధాలతో పార్టీలకు దూరంగా ఉండటం.. ఇవన్నీ కాస్త నిరాశపర్చాయి.
వాస్తవానికి రాధా స్టేచర్ కి మేయర్ పదవి చిన్నది.. అదే ఇతర రాజకీయ నేతల్లా రాధా లాబీయింగ్ చేసుకుని ఉంటే మినిస్టర్ అయి ఉండేవారు. కాని ఇప్పుడు ఆ మేయర్ పదవే రాధా కెరీర్ మరో మలుపు తిప్పుతుందని ఆయన అభిమానులు ఆశపడుతున్నారు. మేయర్ గా రాధా తన మార్క్ చూపిస్తే చాలు… ఇమేజ్ డబల్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రచారంలో సైతం ఎలాంటి విమర్శల జోలికి వెళ్లకుండా ప్రజల సమస్యలు, విజయవాడ ఇష్యూస్ గురించి చెబుతూ వాటిపై హామీలు ఇస్తూ పాజిటివ్ ప్రచారమే చేశారు. అప్పటికి అక్కడక్కడా మామూలుగా అన్న డైలాగులను కూడా హైలెట్ చేస్తూ సోషల్ మీడియాలో రాధాకు కోపం ఎక్కువ అనే ప్రచారం చేయడానికి చాలా ప్రయత్నించారు. అవేమీ పని చేయలేదు. మామూలుగా అయితే విజయవాడ కార్పొరేషన్ పై ఎమ్మెల్యేల పెత్తనం ఎక్కువ. మేయర్ ఉన్నా ఎమ్మెల్యేలదే పై చేయి. కమిషనర్లు కూడా ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇచ్చేవారు. కాని ఇక నుంచి అలా కాదు.. అక్కడ మేయర్ గా ఉన్నది వంగవీటి రాధా. ఎమ్మెల్యే అయినా.. కమిషనర్ అయినా రాధా మాటకు మేయర్ హోదాలో విలువ ఇవ్వాల్సిందే.. పక్కన పెట్టడం సాధ్యమే కాదు. పైగా రాధా విషయం తెలిసినవారు ఎవరూ కూడా కయ్యానికి కాలు దువ్వరు కూడా.
ప్రయోగం విఫలమైంది
ఏబీ వెంకటేశ్వరరావును ముందు పెట్టి వామపక్షాలు చేసిన ప్రయోగం విఫలమైంది. ఈ నిర్ణయంపై రివ్యూ చేసుకోవాల్సిన అవసరం లెఫ్ట్ పార్టీలకు ఎంతైనా ఉంది. అసలు విజయవాడ కార్పొరేషన్ చరిత్రలో వామపక్షాల పాత్ర ఎవరూ కాదనలేనిది. బెజవాడ రాజకీయాలే ఎర్రజెండాతో ముడిపడి ఉంటాయి. అలాంటిది వారు వీక్ అవ్వడమే కాక… ఇలాంటి నిర్ణయాలు తీసుకుని మరింత వీక్ అయ్యారనే చెప్పాలి. ఏబీ వెంకటేశ్వరరావు రిటైర్ అయ్యాక కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అవినీతి ఆరోపణలతో దాడి చేశారు. అంత మాత్రాన ఆయన పదవిలో ఉన్నప్పుడు టీడీపీకి చేసిన ఊడిగం మర్చిపోతారా జనం? రూల్స్ పక్కన పెట్టి టీడీపీ నేతలా వ్యవహరించిన ఏబీవీ మారిపోయారని అంత తొందరగా ఎలా ఫిక్స్ అయ్యారు లెఫ్ట్ నేతలు. ఆయన అలా చేసినందుకే జగన్ టార్గెట్ చేశారు. జగన్ టార్గెట్ చేయడాన్ని ఏనాడు బహిరంగంగా తప్పు పట్టని వామపక్షాలకు ఇప్పుడు మాత్రం ఏబీవీ అద్భుతమైన నాయకుడిగా కనపడటం విచిత్రమే. వీరిది గతి లేక అతుక్కున్న బంధంలాగానే ఉంది. వామపక్షాల నుంచే మేయర్ అభ్యర్ధిని పెట్టుకుని ఉంటే.. కనీసం పార్టీలను, కేడర్ ను కాపాడుకోవడానికి నిలబెట్టుకోవడానికి ఈ ఎన్నికలు పనికి వచ్చేవి. ఇలా ఏబీవిని పెట్టడం వలన ఆ విషయంలో నష్టమే జరిగింది.
