ఇకపై రోజువారీగా వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో అత్యంత కీలకమైన మలుపు తిరిగింది. దాదాపు పదేళ్లకు పైగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఈ హైప్రొఫైల్ సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసుల విచారణ ఇకపై మరింత స్పీడప్ కానుంది. ఈ కేసులను ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా రోజువారీగా (Day-to-day) విచారించాలని సంబంధిత సీబీఐ స్పెషల్ న్యాయస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రధాన నిందితుడైన వైఎస్ జగన్ మోహన్రెడ్డితో పాటు ఈ కేసుల్లో భాగమైన మరో 70 మందికి పైగా నిందితులను ఇక పర్సనల్గా విచారించడానికి కోర్టు ఏర్పాట్లు చేస్తోంది.పదేళ్లుగా జగన్పై ఉన్న దాదాపు 9 ఈడీ ఛార్జిషీట్లు , సీబీఐ కేసులు కోర్టులో పెండింగ్లోనే ఉంటూ వస్తున్నాయి. నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై సరైన టైమ్లో తీర్పులు రాకపోవడమే ఈ ఆలస్యానికి ముఖ్య కారణమని ఈడీ అధికారులు భావించారు. ఈ విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరుతూ ఈడీతో పాటు మాజీ మంత్రి హరి రామజోగయ్య , మరికొంతమంది ప్రముఖులు డైరెక్టుగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ధర్మాసనం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో, సీబీఐ కోర్టు ఈ కేసుల విచారణను పరుగులు పెట్టించడానికి సిద్ధమైంది. మొత్తంగా ఈ తాజా పరిణామం ఏపీ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది.
