రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రతి రోజు లక్షలాది వెహికల్స్‌తో కిటకిటలాడే అత్యంత కీలకమైన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్–65) రూపురేఖలు ఇకపై మారబోతున్నాయి. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అడ్డుకట్ట వేసేలా ప్రస్తుత 4 వరుసల హైవేను 6 వరుసలుగా విస్తరించే బృహత్తర ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయి.చౌటుప్పల్, నల్గొండ, సూర్యాపేట మీదుగా సాగే ఈ రోడ్డు మార్గంలో జర్నీని మరింత ఈజీ చేయడానికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేతృత్వంలో కసరత్తు జరుగుతోంది. ఢిల్లీలో ఎన్హెచ్ఏఐ ఛైర్మన్ సంతోష్‌కుమార్ యాదవ్‌తో జరిగిన చర్చల వల్ల.. నవంబర్ 11వ తేదీలోగా టెండర్ల ప్రాసెస్‌ను పూర్తి చేసి 2027 జనవరి నాటికి పనులను గ్రౌండింగ్ చేసేలా పక్కా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. దాదాపు 270 నుంచి 275 కిలోమీటర్ల వరకూ విస్తరించి ఉన్న ఈ మార్గంలో ప్రధాన హైవేతో పాటు రెండు వైపులా సర్వీసు రోడ్లను డెవలప్ చేయడం ద్వారా వెహికల్స్ రాకపోకలను సజావుగా సాగించేలా ప్లాన్ చేస్తున్నారు.అయితే హైవే విస్తరణ అంటే కేవలం రోడ్డును వెడల్పు చేయడం మాత్రమే కాదని, ప్రయాణీకుల ప్రాణాలకు భద్రత కల్పించడం కూడా అత్యంత ముఖ్యమని ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాలు వార్నింగ్ ఇస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో చూస్తే.. ఒక్క ఎన్‌హెచ్–65 పరిధిలోని 5 జిల్లాల్లోనే ఏకంగా 1,661 రోడ్డు యాక్సిడెంట్స్ జరగగా, 354 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.ఈ ప్రమాదాలకు అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రధాన కారణాలుగా తేలడంతో, అధికారులు హైవేపై మొత్తం 17 ప్రమాదకర ప్రాంతాలను బ్లాక్స్పాట్లుగా గుర్తించారు. చౌటుప్పల్, చిట్యాల, కట్టంగూర్, దురాజ్‌పల్లి జంక్షన్ వంటి ప్రాంతాలలొ ముప్పును తగ్గించడానికి అండర్‌పాస్‌ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధిని స్పీడప్ చేశారు.ఈ ప్రాజెక్టులో భాగంగా 39.85వ కిలోమీటరు నుంచి 221.15వ కిలోమీటరు వరకు మొత్తం 181 కిలోమీటర్ల పనుల కోసం సుమారు రూ.6,792 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రత్యేక ప్యాకేజీని ప్రతిపాదించారు. ఈ పనులు అధికారులు అంచనా వేసే సమయానికి కనుక పూర్తయితే హైదరాబాద్–విజయవాడ ప్రయాణ సమయం చాలా తగ్గడంతో పాటు, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్‌కు అద్భుతమైన కనెక్టివిటీ లభించబోతోందనే చెప్పొచ్చు.
