దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రాసెస్‌పై రాజకీయ వివాదాలు ముదురుతుండటంతో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. కొంతకాలంగా సర్ నిర్వహణలో చోటుచేసుకున్న టెక్నికల్ లోపాలు, అభ్యంతరాలను సరిదిద్దే మెయిన్ టార్గెట్‌తో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, బీహార్, తమిళనాడుతో పాటు మొత్తం 17 రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్ (SIR) ప్రారంభించాలంటూ గురువారం రాత్రి సంచలన ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా ఓటు హక్కు పొందే పద్దెనిమిదేళ్లవారితో పాటు, టెక్నికల్ రీజన్స్ లేదా ఇతర ఇబ్బందుల వల్ల గత జాబితాలో పేర్లు నమోదు కాని అర్హులందరికీ ఇది ఒక గొప్ప అవకాశం కాబోతుంది.ఈ తాజా రివిజన్ కోసం 2027 జనవరి 1న అర్హత గడువుగా ఈసీ అధికారికంగా నిర్ణయించింది. ఈసీ రిలీజ్ చేసిన కొత్త టైమ్‌లైన్ ప్రకారం, రాబోయే నవంబర్ 12వ తేదీన ముసాయిదా ఓటర్ల లిస్ట్‌ను ప్రచురిస్తారు. ఆ తర్వాత పౌరుల నుంచి అభ్యంతరాలు, చేర్పులు , మార్పుల స్వీకరణను పూర్తి చేసి 2027 జనవరి 4వ తేదీన తుది ఓటర్ల లిస్ట్‌ను రిలజ్ చేయనున్నారు. రాబోయే 2027 ఫిబ్రవరి నాటికి ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి ముఖ్యమైన రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనుండటంతో ఈసీ తీసుకున్న ఈ నిర్ణయానికి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.ఇక అసలు వివాదానికి కారణమైన ‘సర్’ ప్రాసెస్‌పై విపక్షాలు ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొత్త ఓటు నమోదు కోసం ఫారం-6 తో పాటు అదనపు డిక్లరేషన్ అడగడం, 30 ఏళ్ల క్రితం నాటి ఓటర్ల వివరాలతో అభ్యర్థుల పేరెంట్స్ డేటాను లింక్ చేయాలని చెప్పడాన్ని విపక్షాలు ఖండిస్తున్నాయి.ఈ స్ట్రిక్ట్ రూల్స్ వల్ల లక్షలాది మంది సామాన్య ఓటర్ల పేర్లు గల్లంతయ్యే ప్రమాదముందంటూ ఇండియా కూటమి ,సీజేపీ వంటి యువజన సంఘాలు ఢిల్లీ వేదికగా ఆందోళనలు చేపట్టాయి. ఇక తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీల్లో ‘సర్’ ప్రాసెస్ ప్రస్తుతం జరుగుతుండటం లేదంటే ముగింపు దశలో ఉండటంతో, ఈ రాష్ట్రాలకు సంబంధించిన ఎస్ఎస్ఆర్(SIR) షెడ్యూల్‌ను కూడా త్వరలోనే స్పెషల్‌గా ప్రకటిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
