ప్రముఖ పారిశ్రామికవేత్త, బైరా ఫౌండేషన్ అధినేత శ్రీ బైరా దిలీప్ చక్రవర్తి బుధవారం సాయంత్రం జనసేన పార్టీలో చేరారు. బుధవారం సాయంత్రం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయనకు ఉపముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నరసరావుపేట ప్రాంతానికి చెందిన శ్రీ బైరా దిలీప్ చక్రవర్తి ప్రజారాజ్యం పార్టీ తరఫున గతంలో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. మొదటి నుంచి మెగా కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన ఆయన జనసేన పార్టీతోనూ కొన్ని రోజులు ప్రయాణం చేసిన అనంతరం వ్యాపార కార్యకలాపాల్లో బిజీ అయ్యారు. మళ్లీ రాజకీయంగా చురుగ్గా జనసేన పార్టీలోనే తన కార్యకలాపాలను కొనసాగించాలని నిశ్చయించుకొని బుధవారం పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా శ్రీ దిలీప్ చక్రవర్తి తాను రచించిన “Life Hacks” పుస్తకాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు. అనంతరం శ్రీ దిలీప్ చక్రవర్తితో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
