లవ్‌లో ఉన్నప్పుడు ఒకరికొకరు తోడుగా ఉండటం అవసరం. మరీ ముఖ్యంగా జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు కూడా పక్కనే నిలబడి వారికి ధైర్యం చెప్పే వ్యక్తి దొరకడం నిజమైన అదృష్టం.డైరెక్టర్ తరుణ్ భాస్కర్ జీవితంలో ఈషా రెబ్బ అలాంటి తోడుగా నిలిచిందని తరుణ్ భాస్కర్ తల్లి, నటి గీతా భాస్కర్ చెప్పిన మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తూ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ ప్రేమలో ఉన్నారనే వార్తలు టాలీవుడ్ సర్కిల్లో కొంతకాలంగా రౌండ్లు కొడుతున్నాయి. ఇటీవల వినాయక చవితి సందర్భంగా ఈషాతో కలిసి దిగిన ఫోటోను తరుణ్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో వీరిద్దరి ప్రేమ బంధంపై క్లారిటీ వచ్చింది. అతి త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, నవంబర్ 19వ తేదీన రిలీజ్ కానున్న ఈ నగరానికి ఏమైంది సీక్వెల్.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో తరుణ్ భాస్కర్ తల్లి గీతా భాస్కర్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా నిలిచాయి. రెండేళ్లుగా తరుణ్ ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశాడని ఆమె చెప్పారు. కోర్టు కేసులు, ఇంటి నిర్మాణం వంటి పనులతో చాలా బిజీగా ఉండటంతో ఇంటికి కూడా సరిగా వచ్చేవాడు కాదని, వచ్చినా అర్ధరాత్రి వచ్చి భోజనం చేసేవాడని ఆరోజులను గుర్తుచేసుకున్నారు.
అలాంటి సమయంలో తరుణ్‌కు ఈషా రెబ్బ అండగా నిలిచిందని గీతా భాస్కర్ ఎమోషనల్ అవుతూ చెప్పారు. ఆమెను తరుణ్‌కు కేవలం స్నేహితురాలిగా మాత్రమే కాకుండా, ఆత్మీయురాలిగా, కుటుంబ సభ్యురాలిగా చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. తనకు వయసు పెరుగుతోందని, తన కొడుకు పక్కన జీవితాన్ని పంచుకునే ఒక తోడు ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.
తరుణ్‌కు అద్భుతమైన సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్యూ ఈషా అంటూ తరుణ్ భాస్కర్ తల్లి చెప్పిన మాటలు ఈ కార్యక్రమంలో ఎమోషనల్ వాతావరణాన్ని నింపాయి. ఈషా ఆ వేడుకకు హాజరు కాకపోయినా కూడా, ఆమెకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పడం ఈవెంట్లో అందరినీ ఆకట్టుకుంది. మొత్తానికి తన కొడుకు జీవితంలో తనకు నచ్చిన తోడు దొరికిందనే తల్లి ఆనందం గీతా భాస్కర్ మాటల్లో క్లియర్‌గా కనిపించింది.
