స్థానిక సంస్థల ఎన్నికల సమరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ను పెంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం సుదీర్ఘమైన ఎన్నికల క్యాలెండర్ను రిలీజ్ చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం ముందుగా పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి మొదలయింది. అక్టోబర్ 18వ తేదీన నామినేషన్ల స్వీకరణ, 19వ తేదీన పరిశీలన, 21వ తేదీన ఉపసంహరణ ప్రాసెస్ ముగిశాక, అక్టోబర్ 28న మున్సిపల్ పోలింగ్ నిర్వహించి అక్టోబర్ 30న ఫలితాలు ప్రకటిస్తారు. ఆ వెంటనే నవంబర్ 3వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరిపి నవంబర్ 5 వ తేదీన కౌంటింగ్ చేపడతారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో రసవత్తరంగా, ఊహించని వేడిని పుట్టిస్తూ సాగే గ్రామ పంచాయతీ ఎన్నికలను నవంబర్ 26వ తేదీ, నవంబర్ 29వ తేదీ అలాగే డిసెంబర్ 2వ తేదీల్లో మూడు విడతలుగా నిర్వహిస్తారు. పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ పూర్తయిన రోజే ఎప్పటిలాగే ఫలితాలు వెల్లడిస్తారు. అయితే ఈ ఎన్నికలలో కొన్ని ప్రాంతాలకు మాత్రం టెంపరరీగా నిరాశే మిగిలింది. ఏపీలో మొత్తం 23 స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఎలక్షన్స్ నిర్వహించడం లేదని ఎస్ఈసీ స్పష్టం చేసింది. దీనిలో శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి వంటి కీలకమైన 4 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు ఆముదాలవలస, రాజాం, పాలకొల్లు, తణుకు, నరసరావుపేట, గుడివాడ, భీమవరం, తాడేపల్లిగూడెం, తాడిగడప, పొన్నూరు, బాపట్ల, కందుకూరు, పొదిలి, కావలి, గూడూరు, అల్లూరు, శ్రీకాళహస్తి మున్సిపాలిటీలతో పాటు చింతలపూడి, బి.కొత్తకోట నగర పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ 23 ప్రాంతాల్లో ఓటర్ల ఫైనల్ జాబితాల రూపకల్పన, వార్డుల పునర్విభజన పనులు పూర్తికాకపోవడంతో పాటు కొన్ని వివాదాలు కోర్టు పరిధిలో ఉండటమే దీనికి మెయిన్ రీజన్. అధికారుల పరిశీలన పూర్తయి, న్యాయపరమైన చిక్కులు తొలగిపోయిన వెంటనే ఈ 23 స్థానాలకు విడిగా స్పెషల్ షెడ్యూల్ ఇచ్చి ఎన్నికలు జరుపుతామని అధికారులు ప్రకటించారు.
